ఎన్నాళ్లీ నడకయాతన!
ABN , Publish Date - Jul 21 , 2025 | 11:25 PM
మండలంలోని మూడు పంచాయతీలకు చెందిన 12 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి మూడు నెలల క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. రహదారి సౌకర్యం లేక పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
బల్లగరువు -మడ్రేబ్ రహదారి నిర్మాణానికి మూడు నెలల క్రితం శంకుస్థాపన
ఇప్పటికీ ప్రారంభంకాని పనులు
రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తరలించాలంటే డోలీ మోతలే శరణ్యం
నిత్యావసర వస్తువులు తెచ్చుకునేందుకు గుర్రాల వినియోగం
మూడు పంచాయతీల ప్రజలకు తప్పని ఇబ్బందులు
రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఎదురుచూపులు
అనంతగిరి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మూడు పంచాయతీలకు చెందిన 12 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి మూడు నెలల క్రితం శంకుస్థాపన చేసినా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదు. రహదారి సౌకర్యం లేక పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని జీనబాడు, పినకోట, పెదకోట పంచాయతీలకు చెందిన బల్లగరువు నుంచి తున్సీబ్ వయా దాయర్తి మీదుగా మడ్రేబ్ వరకు సుమారు 12 కిలో మీటర్ల మేర రూ.11.63 కోట్లతో తారురోడ్డు నిర్మాణానికి ఈ ఏడాది జనవరి నెలలో నిధులు మంజూరయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో డుంబ్రిగుడ మండలంలో పర్యటించిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు రహదారులకు శంకుస్థాపనలో భాగంగా ఈ రోడ్డు పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రెండుసార్లు టెండర్ పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం పనులు ప్రారంభం కాలేదు. అయితే ఇటీవల మూడవసారి టెండర్ పిలిచిన తరువాత కాంట్రాక్టర్లు ముందుకు రావడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. టెండర్లు తెరిచి కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయడమే మిగిలి ఉంది. ఆ పని పూర్తయితే రహదారి పనులు మొదలవుతాయి.
గతంలో అసంపూర్తిగా రోడ్డు పనులు
ఈ రోడ్డు పనులు 2013 నుంచి అసంపూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పినకోట పంచాయతీ జడ్పీరోడ్డు నుంచి రెడ్డిపాలెం వరకు 4.5 కిలో మీటర్ల తారురోడ్డు నిర్మాణానికి రూ.2.23 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జడ్పీ రోడ్డు నుంచి బల్లగరువు వరకు సుమారు రెండు కిలోమీటర్లు మాత్రమే తారురోడ్డు నిర్మాణం చేపట్టి, మిగతా పనులు నిలిపివేశారు. ఎందుకు పనులు నిలిపివేశారో అధికారులకే స్పష్టత లేదు. ఆ తరువాత 2018-19లో రూ.38 లక్షలతో బల్లగరువు నుంచి దాయర్తి వరకు రోడ్డు చదును పనులను ట్రైబల్ వెల్ఫేర్ శాఖ అధికారులు చేపట్టారు. 2022-23లో పంచాయతీరాజ్‌శాఖ నిధులు రూ.1.2 కోట్లతో బల్లగురువు నుంచి దాయర్తి వరకు సుమారు ఏడు కిలో మీటర్లు గ్రావెల్‌రోడ్డు పనులను ప్రారంభించారు. అలాగే మరో రూ.9 లక్షలతో మూడు చోట్ల కల్వర్టులు, బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు వాజంగి- పీచుమామడి మధ్యలో నిర్మించిన కల్వర్టు కొట్టుకుపోయింది.
తప్పని డోలీ మోతలు
రహదారి సౌకర్యం లేక జీనబాడు, పినకోట, పెదకోట పంచాయతీల్లో వాజంగి, రెడ్డిపాడు, పీచుమామిడి, గుమ్మంతి, కరకవలస, గుర్రాలబంధ, గుట్టమనుగరువుతో పాటు దాయర్తి, మడ్రేబు, తున్సీబ్ గ్రామాల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో రోగులు, గర్భిణులను డోలీల్లో తరలించాల్సి వస్తోంది. నిత్యావసర సరకులు తెచ్చుకునేందుకు గుర్రాలను వినియోగిస్తున్నారు. ఈ రహదారి పరిస్థితిపై పంచాయతీరాజ్ ప్రాజెక్ట్స్ డీఈ రవికుమార్ వివరణ కోరగా టెండర్‌కు ఆమోదం లభించిన తరువాత కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే పనులు ప్రారంభం అయ్యేదెన్నడో?, తమ కష్టాలు తీరేది ఎప్పుడోనని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.