శభాష్ రాంబాబు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:03 AM
తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎలమంచిలి తులసీనగర్‌లోని జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ మువ్వల రాంబాబును విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.
ఎలమంచిలి జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్ తెలుగు టీచర్‌కు మంత్రి నారా లోకేశ్ ప్రశంస
తెలుగు భాషాభివృద్ధి, పాఠశాల ఉన్నతికి కృషి చేస్తున్నందుకు అభినందనలు
ఎలమంచిలి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషాభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎలమంచిలి తులసీనగర్‌లోని జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ మువ్వల రాంబాబును విద్యాశాఖా మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. తెలుగును బోధిస్తూ, తెలుగు పాఠ్య పుస్తకాలు రచిస్తూ, తెలుగు వికాసానికి పాటుపడుతున్నందుకు అభినందనలు అని నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ పాఠశాల గురించి, ఉపాధ్యాయుడు రాంబాబు గురించి అందరిలో ఆసక్తి నెలకొంది.
పార్వతీపురం మన్యం జిల్లా పెదబెండపల్లికి చెందిన మువ్వల రాంబాబు ఎలమంచిలి జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్‌లో 2023 సంవత్సరం మే 24న తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు. బడినే గుడిగా భావించి ఆయన విద్యాబోధన చేస్తున్నారు. ఎంఏ(తెలుగు), ఎం ఏ(సంస్కృతం) చదివిన ఆయన గతంలో 18 సంవత్సరాల పాటు హైస్కూల్ తెలుగు పాఠ్య పుస్తక రచయితగా అనేక మాడ్యూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అభ్యాసిక, దీపిక పుస్తకాలు రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అర్చక శిక్షణ, శుభప్రదం, ఆలయం అర్చన, పుస్తకాల రచయితగా సుమారు 10 వేల మందికి శిక్షణ ఇచ్చారు. ఉద్యోగ రీత్యా రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ రీసోర్స్ పర్సన్‌గా వేలాది మంది తెలుగు పండిట్‌లకు శిక్షణ ఇచ్చారు. గతంలో అనకాపల్లి సమీపంలోని సీతానగరం పాఠశాలలో పనిచేసిన సమయంలో తోటి ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతో ఆరు వేల పుస్తకాలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు గ్రంథ పఠనంపై మక్కువ పెంచుకునేలా కృషి చేశారు. పుస్తక పఠనం ప్రాధాన్యం తెలియవచ్చేలా గ్రామంలోని ఆలయాల ఆవరణలో కూడా పుస్తకాలను చదువుకునేందుకు ఏర్పాటు చేసేవారు. ప్రతి విద్యార్థి పుట్టిన రోజున ఒక మంచి పుస్తకం కొనుగోలు చేసుకునేలా వారిలో అభిరుచిని కలిగించారు. ప్రస్తుతం ఎలమంచిలి జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్‌లో తోటి ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేశారు. హెచ్‌ఎం సుశీల పర్యవేక్షణలో ఉపాధ్యాయులంతా విద్యార్థులు చదువులో, క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థినులు రాష్ట్రస్థాయి అండర్ 19 ఫుట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు రాంబాబును మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు.