గ్రామీణ రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:00 AM
మండలంలోని ఎనిమిది పంచాయతీల పరిధిలో కొండలపై గల గ్రామాలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.
90.87 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.79.9 కోట్లు మంజూరు
అటవీ శాఖ అభ్యంతరాలు లేని రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం
తీరనున్న కొండలపై ఉన్న గ్రామాల ప్రజల రవాణా కష్టాలు
కొయ్యూరు, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) మండలంలోని ఎనిమిది పంచాయతీల పరిధిలో కొండలపై గల గ్రామాలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. పీఎం జన్‌మన్ పథకం కింద 90.87 కిలోమీటర్ల మేర 21 రహదారుల నిర్మాణానికి రూ.79.9 కోట్లు మంజూరు కావడంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ (ప్రాజెక్ట్సు) విభాగం అధికారుల పర్యవేక్షణలో సగానికి పైగా రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
మండలంలోని బూదరాళ్ల, ఎం.భీమవరం, మర్రివాడ, నల్లగొండ, అంతాడ, ఎం. మాకవరం, నడింపాలెం, మూలపేట పంచాయతీల్లో పలు గ్రామాలకు స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా ఇప్పటికీ కనీసం రహదారి సౌకర్యం లేదు. రవాణా సదుపాయం లేక అత్యవసర సమయాల్లో వైద్య సేవలందక ఎందరో మృత్యువాత పడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అటువంటి గ్రామాలకు కూటమి ప్రభుత్వం వచ్చాక పీఎం జన్‌మన్ పథకం కింద బీటీ రోడ్ల నిర్మాణానికి నాలుగు నెలల క్రితం రూ 79.9 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో శరభన్నపాలెం- కంపరేగుల రహదారికి రూ.1.74 కోట్లు, రామరాజు పాలెం- గానుగుల మీదుగా కిత్తాబుకు రూ.5.06 కోట్లు, బాలరేవుల నుంచి లోయలపాలెం మీదుగా కునుకూరుకు రూ.3.03 కోట్లు, గరికిబంధ- గరిమండకు రూ. 1.69 కోట్లు, బాలరేవుల- నూకరాయి తోటకు రూ.1.62 కోట్లు, గరిమండ- కొర్రపాడుకు రూ.2.78 కోట్లు, కొక్కుర్తిపాడు నుంచి నిమ్మలగొంది మీదుగా పారికలకు రూ.5.24 కోట్లు, కన్నవరం నుంచి నల్లబిల్లి మీదుగా బొడ్డుమామిడికి రూ.4.15 కోట్లు, ముకుడుపల్లి-కిండంగికి రూ.2.06 కోట్లు, బొడ్డుమామిడి- రాజులపాడుకు రూ.2.48 కోట్లు, నిమ్మలగొంది- డేకురాయికు రూ.2.34 కోట్లు, పోకలపాలెం- గోధుమలంకకు రూ.3.42 కోట్లు, అంతాడ- గంపరాయికి రూ.6.86 కోట్లు, నిమ్మలపాలెం- జోడుమామిడికి రూ. 1.62 కోట్లు, నల్లగొండ- బోయవూట కొత్తవీధికి రూ.1.59 కోట్లు, గరికిబంధ- అన్నవరానికి రూ.4.49 కోట్లు, గరిమండ- పిట్టలపాడుకు రూ.1.16 కోట్లు, కునుకూరు- పోకలపాలేనికి రూ. 2.78 కోట్లు, అర్ల- కుముర్లబంధకు రూ.4.52 కోట్లు, చింతకర్రపాలెం- పీఎల్ కొత్తూరుకు రూ.18.82 కోట్లు, ఎం.భీమవరం- చిలకలపాలేనికి రూ.2.45 కోట్లు మంజూరయ్యాయి. దీంతో వీటి నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో సగానికి పైగా రహదారుల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 10 రహదారులకు సంబంధించి అటవీ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. వీటికి ఈ వారంలోగా అటవీ అనుమతులు వచ్చేందుకు వీలుగా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, వాటి పనులను త్వరలో ప్రారంభిస్తామని జేఈ కిరణ్ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను సంక్రాంతిలోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటు లోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా ఇన్నేళ్లకు తమకు రహదారి సౌకర్యం కలుగుతుండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.