సమపాళ్లలో సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Jul 20 , 2025 | 01:03 AM
ఆర్థికంగా లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి మరో పదేళ్లపాటు ప్రోత్సహించాలని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పట్టణంలోని శివాలయం వీధిలో శనివారం ఉదయం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి స్థానికులతో మాట్లాడారు.
- చంద్రబాబు ప్రభుత్వాన్ని మరో పదేళ్లు ప్రోత్సహించండి
- జగన్ పాలనలో అంతా మోసం, వంచన
- సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల
చోడవరం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ప్రజలకు అందిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి మరో పదేళ్లపాటు ప్రోత్సహించాలని జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. పట్టణంలోని శివాలయం వీధిలో శనివారం ఉదయం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటిని సందర్శించి స్థానికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శివాలయం వీధిలో మహిళలతో మాట్లాడి రూ.4 వేల పింఛను అందుతున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. జగన్ పాలనలో వెయ్యి పింఛను పెంచడానికి ఐదేళ్ల సమయం పట్టిందని, అదే చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే వెయ్యి పెంచి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మూడు నెలల బకాయిలు కూడా కలిపి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కాపుశెట్టి ధనలక్ష్మి, దాడి కోటమ్మ అనే మహిళలు తమకు జగన్ పాలనలో ఇంటి స్థలం మంజూరు చేసినట్టు, ఇల్లు కూడా ఇచ్చినట్టు రికార్డులలో చూపించినా ఇల్లు ఇవ్వలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. తమకు సొంత ఇల్లు లేదని, ఇల్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ జగన్ పాలనలో లబ్ధిదారులకు పథకాలు ఇవ్వకున్నా, ఇచ్చినట్టు చూపించి అందరినీ వంచించారని, తమ ప్రభుత్వం వచ్చాక లబ్ధ్దిదారులకు పథకాలు ఇవ్వాలంటే అందరికీ పథకాలు ఇచ్చేసినట్టు చూపిస్తుండడంతో మంజూరుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. అయినప్పటికీ ఇళ్లు లేని వారందరికీ తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. చుక్కా సుజాత అనే యువతి తన తండ్రికి పింఛను మంజూరు కాలేదని, తనకు ఉద్యోగం లేదని మంత్రికి చెప్పారు. దీనిపై మంత్రి స్పందించి సుజాత తండ్రి దరఖాస్తు చేస్తే పింఛను మంజూరు చేస్తామని, అలాగే యువతకు ఉపాధి అవకాశాల కోసం జాబ్‌మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. అంతకు ముందు మంత్రి స్వయంభూ గౌరీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. మంత్రికి స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సాదరంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్యబాబు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, పార్టీ సీనియర్ నాయకులు గూనూరు మల్లునాయుడు, డెయిరీ డైరెక్టర్ గేదెల సత్యనారాయణ, గవర కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ గంగాధర్, కనిశెట్టి మత్స్యరాజు, మజ్జి గౌరీశంకర్, పూతి కోటేశ్వరరావు, దేవరపల్లి వెంకట అప్పారావు, పప్పు శ్రీనివాసరావు, కొట్టాపు చిన్న, తదితరులు పాల్గొన్నారు.