వాతావరణ సమాచారం మరింత కచ్చితంగా...
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:52 PM
స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ) నిర్వహణలో ఉన్న ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఆధునికీకరిస్తున్నారు.
ఆర్‌ఏఆర్‌ఎస్ ఐఎండీ వాతావరణ కేంద్రం ఆధునికీకరణ
అందుబాటులోకి రానున్న కచ్చితమైన ముందస్తు వాతావరణ సమాచారం
చింతపల్లి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో భారత వాతావరణశాఖ(ఐఎండీ) నిర్వహణలో ఉన్న ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఆధునికీకరిస్తున్నారు. కచ్చితమైన ముందస్తు వాతావరణ సమాచారాన్ని గిరిజన ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నూతన పరికరాలను ఐఎండీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన ప్రాంత వాతావరణ సమాచారం ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు సుమారు 15 ఏళ్ల క్రితం ఐఎండీ అధికారులు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ వాతావరణ కేంద్రం నిర్వహణ బాధ్యతలను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు చూస్తున్నారు. ఈ వాతావరణ కేంద్రం ద్వారా పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు గిరిజన ప్రాంత వాతావరణ సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. తాజాగా ఐఎండీ అధికారులు ఈ వాతావరణ కేంద్రంలో అత్యాధునిక పరికరాలను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాగల ఐదు రోజుల ముందు వాతావరణ సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా వర్ష సూచన, కనిష్ఠ, గరిష్ఠ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ, గాలి దిశ, వేగం తెలుస్తాయి. ప్రతి గంటకు ఉష్ణోగ్రతలను రికార్డు చేస్తూ వెంటనే ఐఎండీ వెబ్‌సైట్‌లో ఈ వాతావరణ కేంద్రం పొందుపరుస్తుంది. వర్షపాతం కొలిచేందుకు ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. నూతన పరికరాల నిర్మాణాన్ని ఐఎండీ టెక్నికల్ అధికారులు శనివారం ప్రారంభించారు. రెండు రోజుల్లో నూతన పరికరాల ఏర్పాటు పూర్తి చేస్తామని ఐఎండీ టెక్నికల్ సిబ్బంది తెలిపారు. ఆర్‌ఏఆర్‌ఎస్ ఐఎండీ వాతావరణ కేంద్రాన్ని ఆధుకికీకరించడంతో మరింత కచ్చితమైన వాతావరణ సమాచారం గిరిజన ప్రాంత ప్రజలకు అందుబాటులోరానుంది. అలాగే ఐఎండీ వెబ్‌సైట్ ద్వారా గిరిజన ప్రాంత వాతావరణ సమాచారం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తెలుసుకోవచ్చు.