అప్పన్న సన్నిధిలో ఆయుధపూజ
ABN , Publish Date - Sep 30 , 2025 | 01:07 AM
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు.
సింహాచలం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సింహాచలం దేవస్థానంలో సోమవారం ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ (ఆయుధపూజ) ఆరాధన జరిపారు. అప్పన్నకు ఉత్సవాల సందర్భంగా అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గద, శరం, విల్లంబు, సుదర్శ చక్రం, తదితర ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించి, ప్రత్యేక పూజల తరువాత పలురకాల ఫలాలను నివేదన చేశారు. ఆలయ స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ పర్యవేక్షణలో పురోహితులు కరి సీతారామాచార్యులు ఈ కార్యక్రమం జరిపారు. మూడు రోజుల పాటు ఉభయ సంధ్యలలో ఆయుధ పూజ కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణాధికారి బి.సత్యశ్రీనివాస్, ప్రజా సంబంధాల అధికారి అప్పలనాయుడు, పలువురు భక్తులు పాల్గొన్నారు.
రేషన్ డిపోలకు అరకొరగా బియ్యం
ఒక్కో డిపోనకు ఐదు నుంచి ఎనిమిది టన్నులు మాత్రమే రాక
ఆన్‌లైన్ విధానంలో సమస్యతో సరఫరాకు అడ్డంకులు
విశాఖపట్నం/గాజువాక/మర్రిపాలెం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
సాంకేతిక సమస్య కారణంగా రేషన్ డిపోలకు ఇప్పటివరకూ అక్టోబరు కోటాలో సగం కంటే తక్కువ బియ్యం అందాయి. సగటున ప్రతి డిపోకు ఐదు నుంచి ఎనిమిది టన్నులు మాత్రమే వచ్చాయి. సుమారు 30 డిపోలకు ఇంతవరకూ అసలు సరకు పంపిణీ చేయలేదు. జిల్లాలో 642 రేషన్ డిపోల పరిధిలో 5.24 లక్షల కార్డుదారుల కోసం ప్రతి నెలా దాదాపు ఎనిమిది వేల టన్నుల బియ్యం కేటాయిస్తారు. ఒకటో తేదీ నుంచి 15 వరకూ కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తారు. అందుకుగాను ముందు నెల 20వ తేదీన మర్రిపాలెం, వడ్లపూడి, భీమిలి, ఆనందపురం, పద్మనాభంలలో గల స్టేజ్-2 గోదాముల నుంచి డిపోలకు సరఫరా మొదలెడతారు. నెలాఖరుకు దాదాపు పూర్తిచేస్తారు. జిల్లాలో ఎఫ్‌సీఐ గోదాములతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి మిల్లర్లు ఈ గోదాములకు బియ్యం పంపుతారు. అయితే రెండు నెలల క్రితం బియ్యం సరఫరా ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ విధానంలో మార్పులు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, విశాఖలో ఎఫ్‌సీఐ గోదాముల నుంచి బియ్యం సరఫరా కావాలంటే తొలుత ఆ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తేనే బిల్లు జనరేట్ అవుతుంది. అయితే కొత్తగా అమలుచేసిన ఆన్‌లైన్ విధానం మొరాయించడంతో గత నెల బియ్యం సరఫరాలో ప్రతిష్టంభన నెలకొంది. గోదాముల నుంచి డిపోలకు సకాలంలో బియ్యం సరఫరా కానందున సెప్టెంబరు నెలలో కార్డుదారులకు సరకులు అందించడంలో జాప్యం జరిగింది. దీంతో డీలర్లు, కార్డుదారుల మధ్య కొన్నిచోట్ల వివాదాలు వచ్చాయి. ఆన్‌లైన్ ఇబ్బందులను పౌర సరఫరాల శాఖ ఉన్నతాఽధికారులకు నివేదించారు. అయినా ఈ నెల కూడా సమస్య పరిష్కారం కాలేదు.
నగరంలో 225 డిపోలకు మర్రిపాలెం గోదాము నుంచి ప్రతినెలా 2,700 టన్నుల బియ్యం సరఫరా కావాల్సి ఉండగా, గత నెలలో ఉన్న స్టాకుతోపాటు ఇంతవరకు 1,300 టన్నులు మాత్రమే పంపిణీ జరిగింది. మరో 24 గంటలు మాత్రమే సమయం ఉంది. ఆన్‌లైన్ సమస్య పరిష్కరిస్తే తప్ప డిపోలకు బియ్యం సరఫరాలో ఇబ్బందులు తొలగవని డీలర్లు వాపోతున్నారు. ఇదిలావుండగా నగరంలో సుమారు 30 రేషన్ డిపోలను పలు కారణాల వల్ల సమీపంలో డిపోలకు అటాచ్ చేశారు. ఈ షాపులకు ఇంతవరకూ సరకులు సరఫరా జరగలేదు. సరకులు సరఫరా చేసేందుకు ఆన్‌లైన్ పోర్టల్‌లో ఆయా షాపుల నంబర్లు కనిపించాలి. కానీ ఆయా షాపుల నంబర్లు కనిపించకపోవడంతో గోదాముల నుంచి సరకు కేటాయింపు జరగలేదని డీలర్లు చెబుతున్నారు.
‘స్త్రీశక్తి’ అమలులో విశాఖ నంబర్‌వన్
ద్వారకా బస్‌స్టేషన్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
‘స్త్రీశక్తి’ పథకం అమలులో ఆర్టీసీ విశాఖ రీజియన్ రాష్ట్రస్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచింది. ఆగస్టు 15న పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ రీజియన్‌లోని మొత్తం ప్రయాణికుల్లో 72.49 శాతం మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. పథకం అమలులో పశ్చిమగోదావరి జిల్లా ద్వితీయ స్థానం (71.18 శాతం)లోను, ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ తృతీయ స్థానం (70.52 శాతం)లో ఉన్నాయి.
2న మాంసం దుకాణాలకు సెలవు
విశాఖపట్నం, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా నగరంలో మాంసం, చేపలు విక్రయించరాదని జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేరోజున విజయదశమి కావడంతో కొంతమంది మాంసాహారానికి మొగ్గుచూపుతారు. అయితే ఎవరైనా దుకాణాలను తెరిచినట్టయితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.