శుద్ధి చేసిన మురుగునీటితో సంపద సృష్టి
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:59 AM
జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న మురుగునీటి నిర్వహణ, శుద్ధి ప్రక్రియ పట్ల దేశంలోని ప్రధాన పట్టణ సంస్థలు ఆసక్తి కనబరిచినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు.
పరిశ్రమలకు ప్రతిరోజూ 67 ఎంఎల్‌డీ విక్రయం
కిలోలీటర్ రూ.60
భవిష్యత్తులో 210 ఎంఎల్‌డీ నీటిని విక్రయించాలని లక్ష్యం
కొచ్చిలో జరిగిన కాన్‌క్లేవ్‌లో ప్రజెంటేషన్
సూరత్ తరహాలో భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంటు నిర్వహణ
జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్
విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న మురుగునీటి నిర్వహణ, శుద్ధి ప్రక్రియ పట్ల దేశంలోని ప్రధాన పట్టణ సంస్థలు ఆసక్తి కనబరిచినట్టు జీవీఎంసీ కమిషనర్ కేతన్‌గార్గ్ తెలిపారు. పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థల పాలన మెరుగుపరిచేందుకు, అభిప్రాయాలను పరస్పరం మార్పిడి చేసుకునేందుకు వీలుగా కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కేరళ రాజధాని కొచ్చిలో ఈనెల 12, 13 తేదీల్లో ‘కేరళ కాన్‌క్లేవ్’ పేరుతో సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో పాల్గొన్న కమిషనర్ కేతన్‌గార్గ్ సోమవారం నగరానికి తిరిగి వచ్చారు. సదస్సుకు సంబంధించిన ముఖ్యాంశాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వివరించారు.
కొచ్చిలో జరిగిన కాన్‌క్లేవ్‌కు దేశంలోని పది రాష్ట్రాల నుంచి 30 నగరాలకు చెందిన కమిషనర్లు, మేయర్లతోపాటు ఆయా రాష్ట్రాలకు చెందిన మంత్రులు హాజరైనట్టు కేతన్‌గార్గ్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో మురుగునీటి నిర్వహణ, శుద్ధికి జీవీఎంసీ తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించామన్నారు. నగరంలో ఇప్పటికే 1.2 లక్షల నివాసాలకు యూజీడీ సదుపాయం కల్పించామని, త్వరలో రూ.498 కోట్లతో మధురవాడ ప్రాంతంలో కొత్తగా యూజీడీ నెట్‌వర్క్ అభివృద్ధి, మరో రూ.56 కోట్లతో ఇప్పటికే యూజీడీ నెట్‌వర్క్ ఉన్న ప్రాంతాల్లో గ్యాప్‌లను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పడం జరిగిందన్నారు. ఆ మురుగునీటిని యూజీడీ నెట్‌వర్క్ నుంచి పంప్‌హౌస్‌లకు, అక్కడి నుంచి సివరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లకు తరలించడం, అక్కడ మురుగునీటిని శుద్ధి చేయడం గురించి వివరించానన్నారు. అలాగే ఎస్‌టీపీల్లో శుద్ధి చేసిన నీటిని సముద్రంలోకి విడిచిపెట్టేయకుండా, నగరంలో మొక్కలు, పచ్చదనం పెంపునకు వినియోగిస్తుండడంపై వీడియోలను ప్రదర్శించామన్నారు. మురుగునీటిని శుద్ధి చేయడానికి భారీగా ఖర్చు చేస్తున్నామని, ఆదాయం సమకూర్చుకోవడం కోసం శుద్ధి చేసిన నీటిని పరిశ్రమలకు విక్రయించడం ప్రారంభించగా, వారి నుంచి డిమాండ్ పెరుగుతోందని వివరించామన్నారు. ప్రస్తుతం శుద్ధి చేసిన మురుగునీటిని కిలోలీటర్ రూ.60 చొప్పున ప్రతీరోజూ 67 ఎంఎల్‌డీ విక్రయిస్తున్నామని, భవిష్యత్తులో 210 ఎంఎల్‌డీ నీటిని విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నందున దానికి సంబంధించిన ప్రణాళికలను వివరించానన్నారు. దీనికి అందరి నుంచి మంచి స్పందన లభించడంతోపాటు ఆయా నగరాల్లో కూడా దీనిని అమలుచేసే మార్గాలపై దృష్టిసారిస్తామని తనతో పేర్కొన్నారన్నారు.
మరోవైపు సూరత్ మోడల్‌లో నగరంలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కనస్ట్రక్షన్ అండ్ డిమాలిస్డ్ వేస్ట్ (సీ అండ్ డీ) ప్లాంటును నిర్వహించాలని నిర్ణయించామన్నారు. జీవీఎంసీలో సీ అండ్ డీ ప్లాంటు నిర్వహణకు జీవీఎంసీయే కాంట్రాక్టర్‌కు డబ్బులు చెల్లిస్తుండగా, సూరత్‌లో డెవలపరే అక్కడి కార్పొరేషన్‌కు డబ్బులు కడుతుండడం తనను ఆకట్టుకుందన్నారు. శిధిల భవనాలు, పాత భవనాలను ఎవరైనా కూల్చివేసి దాని స్థానంలో కొత్తనిర్మాణం చేపట్టాలంటే ముందుగా నగర పాలక సంస్థ అనుమతి కోసం దరఖాస్తు చేస్తారన్నారు. ఆ సమయంలోనే డెబ్రిస్‌ను యార్డుకు తరలించడానికి అయ్యే ఖర్చును భవన యజమాని నుంచి వసూలుచేస్తున్నారన్నారు. ఆ డెబ్రిస్‌ను కాంట్రాక్టర్ (డెవలపర్) యార్డుకు తీసుకువెళ్లి అక్కడ టైల్స్, సిమెంట్ ఇటుకలు తయారుచేసి విక్రయించుకుంటున్నారన్నారు. దీనివల్ల అక్కడి కార్పొరేషన్‌పై ఆర్థిక భారం పడకుండా, తిరిగి ఆదాయం చేరుతోందన్నారు. అదే మోడల్‌ను త్వరలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.