అన్నదాతకు అండగా ఉంటాం
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:20 AM
రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
హోం మంత్రి అనిత
పాయకరావుపేట రూరల్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మండలంలోని పెదరాంభద్రపురం గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన ‘రైతన్నా మీకోసం - రైతు వారోత్సవాలు’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ కింద జిల్లాలో సుమారు 2 లక్షల 42 వేల మంది రైతులకు రూ.320 కోట్లు జమ చేశామన్నారు. రైతులు సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేయాలన్నారు. వారంలో ఒకరోజు పాఠశాల విద్యార్థులను సేంద్రీయ వ్యవసాయం చేసే పొలాలకు తీసుకు వెళ్లి వ్యవసాయం నేర్పించాలన్నారు. అంతకు ముందు ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్న పొలాన్ని, ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె పరిశీలించారు. రైతులతో ముఖాముఖీ నిర్వహించారు. అనంతరం అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకంలో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ రైతులకు రూ.25కోట్ల 60 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జేడీ ఆశాదేవి, ఏడీఏ కె.ఉమాప్రసాద్, ప్రకృతి వ్యవసాయం ఏడీఏ లచ్చన్న, వ్యవసాయాధికారులు పి.ఆదినారాయణ, సౌజన్య, ఏఎంసీ చైర్మన్ దేవర సత్యనారాయణ, వైస్ చైర్మన్ కంకిపాటి వెంకటేశ్వరరావు, కాపు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, పీఏసీఎస్ చైర్మన్ దేవవరపు రాజుబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు చించలపు ప్రదీప్, పార్టీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేశ్, పరిశీలకులు వెంకటేశ్వరరావు, క్లస్టర్ ఇన్‌చార్జులు దేవవరపు ఆనంద్, వంకా వెంకటరమణ, కాశీవిశ్వనాథ్, తహశీల్దార్ ఎస్‌ఏ మహేశ్వరరావు, ఎంపీడీవో విజయలక్ష్మి, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.