వంద కాఫీ అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తాం
ABN , Publish Date - Sep 12 , 2025 | 11:13 PM
జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో వంద కాఫీ అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
అరకులోయలో కాఫీ అవుట్ లెట్ ప్రారంభం
అరకులోయ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో వంద కాఫీ అవుట్ లెట్లు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ప్రకటించారు. శుక్రవారం అరకులోయ గిరిజన మ్యూజియం ఆవరణలో కాఫీ అవుట్ లెట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థానిక స్వయంసహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో సెర్పు ఆధ్వర్యంలో నేటివ్ అరకు కాఫీ అవుట్‌లెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. హైప్రీమియం కాఫీ ఈ అవుట్‌లెట్లలో మాత్రమే లభిస్తుందన్నారు. ఒక్కొక్క అవుట్‌లెట్‌లో నలుగురికి ఉపాధి లభిస్తుందని కలెక్టర్ దినేశ్‌కుమార్ అన్నారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, సందర్శిత ప్రాంతాలలో వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. కాఫీని పండించే రైతులకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా అరకు కాఫీ మరింత ఎక్కువ మంది సేవించేందుకు అవకాశం లభిస్తుందన్నారు. ఆర్టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి, ప్రధానమంత్రికి అరకు కాఫీ రుచి చూపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా అరకు కాఫీకి చక్కటి ఖ్యాతి లభించేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారన్నారు. ఎమ్మెల్యే మత్సలింగం మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో లభించే ఆర్గానిక్ కాఫీకి మంచి పేరుందని, ప్రస్తుతం ప్రారంభించిన నేటివ్ అరకు కాఫీ మరింత ఖ్యాతిని తెచ్చేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, సెర్పు అధికారులు, టీడీపీ మండల అధ్యక్షుడు లకోయ్ మహదేవ్ తదితరులు పాల్గొన్నారు.