Share News

కాలుష్యం తగ్గిస్తాం

ABN , Publish Date - Dec 18 , 2025 | 01:23 AM

నగరంలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని, ఇందుకు తగిన ప్రమాణాలు పాటిస్తున్నామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ పేర్కొన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో భాగంగా తొలిరోజు బుధవారం కలెక్టర్‌ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ గత సమావేశానికి, ఇప్పటికీ నగరంలో కాలుష్యం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొనడంతో కలెక్టర్‌ స్పందించారు.

కాలుష్యం తగ్గిస్తాం

అందుకు ప్రణాళికాయుతంగా చర్యలు

పర్యావరణ విధానాలు, చట్టాలు,

నిబంధనలు సమర్థంగా అమలు

అమరావతి సదస్సులో జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌

అవుట్‌సోర్సింగ్‌ వైద్యుల నియామక ప్రక్రియలో

జిల్లా ఎంపిక కమిటీలకు ప్రాధాన్యం కల్పించాలని వినతి

పరిశ్రమల గ్రౌండింగ్‌ బాధ్యత కలెక్టర్లదేనన్న సీఎం

విశాఖపట్నం, డిసెంబరు 17 (ఆంరఽధజ్యోతి):

నగరంలో కాలుష్య నివారణకు పటిష్ఠ చర్యలు చేపడుతున్నామని, ఇందుకు తగిన ప్రమాణాలు పాటిస్తున్నామని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ పేర్కొన్నారు. అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన సదస్సులో భాగంగా తొలిరోజు బుధవారం కలెక్టర్‌ జిల్లాకు సంబంధించి పలు అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ గత సమావేశానికి, ఇప్పటికీ నగరంలో కాలుష్యం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొనడంతో కలెక్టర్‌ స్పందించారు. నగరంలో కాలుష్య నివారణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. పర్యావరణ విధానాలు, చట్టాలు, నిబంధనలను సమర్థంగా అమలు చేయడంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కలెక్టర్‌ తెలిపారు. కాలుష్య తీవ్రత తగ్గే విధంగా ప్రణాళికాయుతంగా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాగా వైద్య ఆరోగ్య శాఖలో అవుట్‌సోర్సింగ్‌ వైద్యుల నియామక ప్రక్రియలో జిల్లా ఎంపిక కమిటీలకు ప్రాధాన్యం కల్పించాలని, ఈ కమిటీలు వైద్యుల నియామకాలు చేపట్టేలా అనుమతి ఇవ్వాలన్నారు. దీనివల్ల ఎంపిక ప్రక్రియలో జాప్యం తగ్గుతుందని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టే క్రమంలో అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో సంక్లిష్టత నెలకొంటుందని కలెక్టర్‌ వివరించారు. ఈ సమస్యపై ఒక నిర్ణయం తీసుకోవాలని సీఎంను కోరారు.

పర్యాటక, ఐటీ పరిశ్రమలకు ప్రాధాన్యం

తొలుత పర్యాటక రంగానికి, ఆ తరువాత ఐటీ పరిశ్రమలకు భూ కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నారా చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో జరిగిన ఎంఓయూలు, అలాగే మంత్రివర్గం నిర్ణయించిన మేరకు పరిశ్రమలు ఆయా జిల్లాల్లో నిర్ణీత సమయంలోగా గ్రౌండింగ్‌ చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. గరిష్ఠంగా 45 రోజుల్లో పరిశ్రమ గ్రౌండింగ్‌ జరగాలన్నారు. వీటిపై ప్రతి వారం జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించుకొని, ప్రతి 15 రోజులకు సెక్రటరీలకు సమాచారం పంపాలన్నారు. అవసరమైతే జీవీఎంసీ కమిషనర్‌ సహాయం తీసుకోవాలని విశాఖ కలెక్టర్‌కు సూచించారు.

విశాఖ సదస్సులో 96 కంపెనీలు ఎంఓయూలు చేయగా, వాటి ద్వారా రూ.97 లక్షల కోట్ల పెట్టుబడులు, 2.1 లక్షల ఉద్యోగాలు రావలసి ఉందని, అలాగే మంత్రి వర్గం నిర్ణయాల మేరకు మరో 28 కంపెనీలు ఒప్పందాలు చేయగా వాటి ద్వారా రూ.1.24 కోట్లు, ఉద్యోగాలు 1.37 లక్షల మందికి రావాలన్నారు. మొత్తంగా చూసుకుంటే 124 కంపెనీలు, రూ.2.21 కోట్ల పెట్టుబడులు, 3.47 లక్షల ఉద్యోగాలు రావాలని, వాటిని గ్రౌండింగ్‌ చేయించాలని కలెక్టర్‌కు సూచించారు.

పర్యాటక రంగంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 66 ఎంఓయూలు చేయగా వాటి ద్వారా రూ.11,092 కోట్ల పెట్టుబడులు రావలసి ఉంది. ఇప్పటివరకూ వాటిలో 9 కంపెనీలు గ్రౌండింగ్‌ కాగా వాటి ద్వారా 2,916 కోట్ల పెట్టుబడులు రానున్నాయని, కొత్తగా 1,880 గదులు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. వాటి ద్వారా నేరుగా 5,250 మందికి, పరోక్షంగా 8,450 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

Updated Date - Dec 18 , 2025 | 01:23 AM