వర్గ రాజకీయాలను సహించబోం
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:55 AM
టీడీపీ నాయకులు వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించబోమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు హెచ్చరించారు. మండలంలోని వడ్డాదిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల బుచ్చెయ్యపేట మండలంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఫ్లెక్సీల రగడపై ఆయన స్పందించారు.
- పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవు
- టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు హెచ్చరిక
బుచ్చెయ్యపేట, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులు వర్గ రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించబోమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు హెచ్చరించారు. మండలంలోని వడ్డాదిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల బుచ్చెయ్యపేట మండలంలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఫ్లెక్సీల రగడపై ఆయన స్పందించారు. టీడీపీ ఫ్లెక్సీల్లో జిల్లా అధ్యక్షుడిగా తన పేరు, ఫొటో లేకపోవడాన్ని ఆయన ఖండించారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలలో కచ్చితంగా ప్రొటోకాల్ పాటించాలన్నారు. బుచ్చెయ్యపేటలో ఫ్లెక్సీల వివాదాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళతామన్నారు. ఈ అంశంపై ఎమ్మెల్యే రాజుతో కూడా మాట్లాడతానని చెప్పారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య ఉన్నా కార్యకర్తలు తమ దృష్టికి తీసుకురావచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్యేలు ప్రతీ బుధవారం తమ నియోజకవర్గంలో ప్రజలతోను, పార్టీ కార్యకర్తలతోను వేర్వేరుగా గ్రీవెన్స్ నిర్వహించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇన్‌చార్జులు పార్టీ కార్యకర్తలతోనే గ్రీవెన్స్ నిర్వహిస్తారని చెప్పారు. ఈ నెలాఖరునాటికి టీడీపీ గ్రామ, మండల, జిల్లా కమిటీలు పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 15కల్లా కేఎస్‌ఎస్ కమిటీలు పూర్తి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి పార్టీలో, నామినేటెడ్ పదవుల్లో గౌరవం కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు దొండా నరేశ్, తెలుగు జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరిశెట్టి శ్రీరామ్మూర్తి, సీనియర్ నేత సయ్యపురెడ్డి మాధవరావు, హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్ కోవెల వెంకటరమణ, పార్టీ మండల కార్యదర్శి ద్వారపురెడ్డి శంకర్రావు, మాజీ వార్డు సభ్యులు కె.గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.