Share News

ఉత్సవాల పేరిట వ్యాపారం చేస్తే ఉపేక్షించం

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:50 AM

నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించదలచినవారు తగిన అనుమతులు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు.

ఉత్సవాల పేరిట వ్యాపారం చేస్తే ఉపేక్షించం

పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

నగరంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించదలచినవారు తగిన అనుమతులు తీసుకోవాలని పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సూచించారు. నిర్వాహకులు దరఖాస్తు చేసుకుంటే సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇస్తామన్నారు. ఎవరైనా వినాయకుడి దర్శనానికి, పూజలు పేరిట టికెట్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తే వెంటనే వాటిని మూసివేస్తామని స్పష్టంచేశారు. పూజాది కార్యక్రమాలు తొమ్మిది రోజులే నిర్వహించుకోవాలన్నారు. ఉత్సవాల పేరుతో వ్యాపారం చేస్తే అంగీకరించబోమన్నారు.


ఏయూ మాజీ రిజిస్ర్టార్‌లకు బెయిలబుల్‌ వారెంట్లు

విశాఖపట్నం, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ అధికారులకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. వర్సిటీలోని థియేటర్స్‌ ఆర్ట్స్‌ విభాగానికి చెందిన ముగ్గురు అధ్యాపకులు (కన్సాలిడేటెడ్‌) తమను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ 2011లో హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసు నడుస్తోంది. తాజాగా రెండు రోజుల కిందట విచారణకు వచ్చింది. ఈ కేసు మొదలైనప్పటి నుంచి రిజిస్ర్టార్లుగా పనిచేసిన ప్రొఫెసర్‌ నిరంజన్‌, ప్రొఫెసర్‌ ఉమామహేశ్వరరావు, ప్రొఫెసర్‌ కృష్ణమోహన్‌తోపాటు ప్రస్తుతం రిజిస్ర్టార్‌గా ఉన్న ప్రొఫెసర్‌ ధనుంజయరావు కోర్టుకు హాజరుకావాలని గత వాయిదా సమయంలో న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ప్రస్తుత రిజిస్ర్టార్‌ ధనుంజయరావు మినహా మిగిలిన ముగ్గురు కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి తొలుత నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఏయూ స్టాండింగ్‌ కౌన్సిల్‌కు చెందిన న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ప్రస్తుత రిజిస్ర్టార్‌ కోర్టుకు హాజరయ్యారని, మరో ఇద్దరు వర్చువల్‌గా హాజరయ్యారని న్యాయమూర్తికి వివరించారు. అయితే కోర్టుకు నేరుగా హాజరుకావాలని చెప్పినప్పటికీ రాకపోవడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించి ముగ్గురు మాజీ రిజిస్ర్టార్లకు బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేస్తూ ఆదేశాలిచ్చారు. కేసు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ, నలుగురు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి స్పష్టంచేశారు.


స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో పట్టపగలు చోరీ

24 తులాల బంగారు ఆభరణాలు అపహరణ

అదేబాక్సులో ఉన్న మరో 40 తులాల ఆభరణాలను విడిచిపెట్టిన దొంగలు

ఉక్కుటౌన్‌షిప్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి):

స్టీల్‌ప్లాంటు టౌన్‌షిప్‌లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఇందుకు సంబందించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్టీల్‌ప్లాంటు సెక్టార్‌-6లోని 105 బి క్వార్టర్స్‌లో హెచ్‌ఆర్‌ విభాగం డీజీఎం ఎన్‌.సుందరం కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ఆయన శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో భార్యతో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి సాయంత్రం వచ్చేసరికి ఇంటి ప్రధాన తలుపు పగులగొట్టి ఉంది. లోపలకు వెళ్లి చూడగా బీరువా గడియ విరగ్గొట్టి ఉండడంతో స్టీల్‌ప్లాంటు క్రైమ్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో సుమారు 24 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. బీరువాలో ఒకే బాక్సులో సుమారు 64 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ బాక్సులో చిన్న చిన్న వస్తువులు మొత్తం 24 తులాల ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. మిగతా 40 తులాలు అలాగే ఉన్నాయి. చోరీపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:50 AM