Share News

గిరిజనులకు న్యాయం చేస్తాం

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:17 AM

గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పాడేరు మండలం లగిశపల్లిలో శనివారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో జీవో 3, గిరిజనులకు టీచర్‌ ఉద్యోగాల గురించి ఆయన ప్రస్తావించారు.

గిరిజనులకు న్యాయం చేస్తాం
వంజంగి గ్రామంలో వంతాల కొండమ్మ అనే గిరిజన మహిళ ఆతిథ్యం స్వీకరిస్తున్న సీఎం చంద్రబాబు

నాడు జీవో 275ను తీసుకువచ్చి,

వేలాది మంది గిరిజనులకు

ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించింది టీడీపీయే

- ఆదివాసీ దినోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

- జీవో 3కి ప్రత్యామ్నాయంపైనా కసరత్తు

వారి హక్కులకు రక్షణ కల్పిస్తాం

- అరకు కాఫీకి ప్రపంచ స్థాయి మార్కెటింగ్‌

పాడేరు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

గిరిజనులకు ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. పాడేరు మండలం లగిశపల్లిలో శనివారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో జీవో 3, గిరిజనులకు టీచర్‌ ఉద్యోగాల గురించి ఆయన ప్రస్తావించారు. 1986లో తెలుగుదేశం ప్రభుత్వం ఏజెన్సీలోని టీచర్‌ పోస్టులు గిరిజనులకే ఇవ్వాలని నిర్ణయించి జీవో 275ను తీసుకువచ్చి, వేలాది మందికి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిందన్నారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో కొట్టివేశారని, దానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి గిరిజనులకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే 2000లో జీవో 3ను తీసుకువచ్చామన్నారు. దానిని సైతం 2020లో సుప్రీంకోర్టు కొట్టి వేసిందన్నారు. అయితే గతంలో జీవో 275, ఇప్పుడు జీవో 3 పోవడానికి కాంగ్రెస్‌, వైసీపీలే కారణమని సీఎం ఆరోపించారు. వైసీపీ హయాంలో జీవో 3 రద్దయితే దానిపై కనీసం కౌంటర్‌ కూడా వేయలేదన్నారు. గిరిజనుల హక్కులను కాపాడే విధానం అదేనా? అంటూ వైసీపీని సీఎం ప్రశ్నించారు. జీవో 3కి ప్రత్యామ్నాయం రూపొందించి, భవిష్యత్తులో గిరిజనులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తిరిగి వారి హక్కులు వారికి దక్కేలా చేస్తానన్నారు. జీవో 3 రద్దయిన తరువాత వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ గిరిజనులకు న్యాయం చేయడానికి కనీసం ప్రయత్నం చేయలేదన్నారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో బ్రిటీష్‌వాళ్లను ఎదురించిన గిరిజనులు సైతం వైసీపీ ప్రభుత్వానికి భయపడి జీవో 3పై పోరాటం చేసేందుకు భయపడ్డారని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమంపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని, గిరిజనులకు న్యాయం చేసేది తామేనన్నారు. జీవో 3 రద్దు నేపథ్యంలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి, వారికి న్యాయం చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. అందుకుగాను కసరత్తు చేస్తున్నామని, ఇప్పటికే ఐటీడీఏల వారీగా గిరిజనులు, వారి సంఘాల అభిప్రాయాలను సేకరించామన్నారు. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి త్వరలోనే గిరిజనులకు న్యాయం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని సీఎం స్పష్టం చేశారు.

అరకు బ్రాండ్‌ కాఫీకి ప్రపంచ స్థాయి మార్కెటింగ్‌

ఏజెన్సీకి చెందిన అరకు కాఫీని తానే ప్రమోట్‌ చేస్తున్నానని, ప్రపంచమంతటా మార్కెటింగ్‌ జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. పారిస్‌లో కూడా అరకు కాఫీ స్టాల్‌ పెట్టామన్నారు. ఇక్కడ ఏజెన్సీలోని 11 మండలాల్లో 2.58 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు చేస్తుండగా, అదనంగా మరో లక్ష ఎకరాల్లో కాఫీ తోటలు వేస్తామన్నారు. 1.8 లక్షల ఎకరాల్లో చెర్రీ కాఫీ సాగు చేపట్టి 90 వేల టన్నుల ఉత్పత్తి సాధిస్తున్నారన్నారు. జీసీసీ ద్వారా కాఫీ, తేనె, రాగులు, అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయించి గిరిజనుల ఉత్పత్తుల ఆదాయం మూడు రెట్లు చేసే ఆలోచన ఉందన్నారు.

Updated Date - Aug 10 , 2025 | 01:17 AM