Share News

హైడ్రో ప్రాజెక్టులపై అనుమానాలను నివృత్తి చేస్తాం

ABN , Publish Date - Sep 29 , 2025 | 11:25 PM

హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై గిరిజనులకు ఉన్న అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేస్తామని, మరో 15 రోజుల్లో ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు.

హైడ్రో ప్రాజెక్టులపై అనుమానాలను నివృత్తి చేస్తాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, ప్రక్కన ఐటీడీఏ పీవో శ్రీపూజ, జేసీ అభిషేక్‌ గౌడ

15 రోజుల్లో కంపెనీ ప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో పూర్తి స్థాయి సమావేశం నిర్వహిస్తాం

కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

అరకులోయ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై గిరిజనులకు ఉన్న అనుమానాలను పూర్తి స్థాయిలో నివృత్తి చేస్తామని, మరో 15 రోజుల్లో ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, హైడ్రో పవర్‌ ప్రాజెక్టు కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం సాయంత్రం మండల పరిషత్‌ సమావేశ మందిరంలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టులకు సంబంధించి అరకులోయ, అనంతగిరి, హుకుంపేట మండలాల పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తొలుత గిరిజన సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామసభలు నిర్వహించకుండా, పెసా గ్రామ కమిటీల తీర్మానాలు లేకుండా ప్రభుత్వం ఏ విధంగా పవర్‌ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. ఇది సమతా జడ్జిమెంట్‌కు వ్యతిరేకమని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దిగువ, ఎగువ రిజర్వాయర్‌ ఆనకట్ట స్థలాలు మాత్రమే ప్రభావితం అవుతాయని, మధ్యలోని ప్రాంతాలు ప్రభావితం కావని స్పష్టం చేశారు. ప్రస్తుత సర్వేలు డీజీపీఎస్‌ ఆధారితమైనవి మాత్రమేనని, ఇంకా స్థలాకృతి లేదా వరద సర్వేలు ఖరారు కాలేదని తెలిపారు. ప్రతిపాదిత జలాశయాలకు సంబంధించి వివరణాత్మక బ్లాక్‌ మ్యాప్‌లు, ముంపు విస్తీర్ణంపై స్పష్టమైన డేటాతో మరో 15 రోజుల్లో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. అలాగే గిరిజనులకు ఆదాయం, ఉపాధికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో శ్రీపూజ, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 11:25 PM