అండగా ఉంటాం
ABN , Publish Date - Apr 17 , 2025 | 12:43 AM
మండలంలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు కోటవురట్ల మండలానికి చెందిన వారు వున్నారు. కైలాసపట్నానికి చెందిన అప్పికొండ తాతబ్బాయి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తుండడంతో అతనిపై కేసు నమోదైంది. దీంతో నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి పరిహారం అందజేయలేదు.
పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది
బాణసంచా కేంద్రంలో పేలుడు మృతుల కుటుంబాలకు హోం మంత్రి అని భరోసా
ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులు పంపిణీ
కోటవురట్ల, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కైలాసపట్నంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, వీరిలో ఆరుగురు కోటవురట్ల మండలానికి చెందిన వారు వున్నారు. కైలాసపట్నానికి చెందిన అప్పికొండ తాతబ్బాయి బాణసంచా తయారీ కేంద్రం నిర్వహిస్తుండడంతో అతనిపై కేసు నమోదైంది. దీంతో నిబంధనల ప్రకారం అతని కుటుంబానికి పరిహారం అందజేయలేదు. మిగిలిన బాధితులకు ఆయా గ్రామాల్లో వారి ఇళ్లకు వెళ్లి ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున చెక్కులు అందించారు. కైలాసపట్నంలో పురం పాప కుమార్తెకు, గుంపిన వేణుబాబు భార్యకు, సంగరాతి గోవింద భార్యకు, చౌడువాడలో సేనాపతి బాబురావు భార్యకు, రాజుపేటలో దాడి రామలక్ష్మి కుమార్తెకు ఎక్స్‌గ్రేషియా అందజేశారు. ఆయా మృతుల చిత్రపటాల వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించారు. తమ చదువుల కోసం నాన్న బాణసంచా కేంద్రంలో పనికి వెళుతూ మృతిచెందాడని, ఇప్పుడు ఆయన లేకపోవడంతో ఎలా చదువుకోవాలో అర్థం కావడం లేదని సంగరాతి గోవింద కుమారుడు మహేశ్, కుమార్తె లహరీ వాపోయారు. దీంతో మంత్రి అనిత స్పందిస్తూ.. మీ చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. తమ కుటుంబం గడవడానికి ఏదైనా ఉపాధి చూపించాలని గుంపిన వేణుబాబు భార్య దేవి విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలో ఆయాగా అయినా పనిచేస్తానని ఆమె కోరుతూ కంటతడి పెట్టుకున్నారు. అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఎక్కడ ఖాళీ వుంటే అక్కడ ఆయా పోస్టు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు..