Share News

గిరిజనుల అభిప్రాయాలను గౌరవిస్తాం

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:46 PM

జిల్లాలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టబోమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.

గిరిజనుల అభిప్రాయాలను గౌరవిస్తాం
మాట్లాడుతున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టీకరణ

హైడ్రో పవర్‌ ప్రాజెక్టులపై ఆందోళన వద్దు

లాభనష్టాలపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటన

జరుగుతున్న పనులను నిలుపుదల చేయాలని కలెక్టర్‌కు ఆదేశం

పాడేరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుపై గిరిజనులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి అభిప్రాయాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు చేపట్టబోమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం పాడేరు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. గిరిజనుల అభీష్టం మేరకు మాత్రమే హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని, వారికి నష్టం కలుగుతుందని వద్దంటే.. అటువంటి చర్యలను విరమించుకుంటామన్నారు. ఇదే క్రమంలో అక్కడ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ఏర్పాటుతో ఆరు వేలమందికి ఉద్యోగాలు వస్తాయని యువత ఆశ పడుతున్నారన్నారు. అయితే వాటి ఏర్పాటుతో గిరిజనులకు కలిగే లాభనష్టాలపై అన్ని వర్గాల నేతలు, ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై అభిప్రాయాలను సేకరించిన తర్వాత మాత్రమే వాటికి ముందుకు వెళతామన్నారు. ఈవిషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే తమ ప్రాంతంలోనూ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులిస్తే, స్థానికులు వాటిని రద్దు చేయమంటే రద్దు చేశామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి గుర్తు చేశారు. గిరిజనుల ప్రాణాలకు, వారి జీవనానికి భంగం కలిగే పనులు తమ ప్రభుత్వం చేయబోదని, వారికి మేలు జరిగే కార్యక్రమాలను మాత్రమే చేపడుతుందన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం హైడ్రో పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి ఏ పనులు జరుగుతున్నా తక్షణమే నిలుపుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ను మంత్రి సంధ్యారాణి ఆదేశించారు.

Updated Date - Oct 04 , 2025 | 11:46 PM