ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నాం
ABN , Publish Date - Apr 26 , 2025 | 12:47 AM
కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో 22వ తేదీన జరిగిన ఉగ్రవాదుల దాడి నుంచి అనకాపల్లికి చెందిన దంపతులు త్రుటిలో తప్పించుకుని బయటపడిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.
అనకాపల్లికి చెందిన శ్రీబాలాజీ, భవాని దంపతులు
దాడికి పది నిమిషాల ముందు పహల్గాం నుంచి తిరుగుముఖం
కాల్పుల శబ్దాలతో భయంతో పరుగులు
క్షేమంగా ఇంటికి చేరిక
అనకాపల్లి టౌన్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో 22వ తేదీన జరిగిన ఉగ్రవాదుల దాడి నుంచి అనకాపల్లికి చెందిన దంపతులు త్రుటిలో తప్పించుకుని బయటపడిన సంఘటన ఆలస్యంగా తెలిసింది. ఇందుకు సంబంధించి వారు తెలిపిన వివరాలిలా వున్నాయి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రొఫెషనల్ వింగ్‌లో పనిచేస్తున్న స్థానిక నరసింగరావుపేటకు చెందిన పి.శ్రీబాలాజీ, భార్య భవానితో ఈ నెల 16వ తేదీన హానీమూన్‌కు బయలుదేరారు. తొలుత ఢిల్లీ, ఆగ్రాల్లో పర్యాటక ప్రదేశాలను సందర్శించారు.. 19వ తేదీన కశ్మీర్‌కు చేరుకున్నారు. 20న సోన్‌మార్గ్, 21న గుల్మార్గ్‌లోని పర్యాటక ప్రాంతాలు సందర్శించారు. 22వ తేదీన పహల్గాం చేరుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆహ్లాదంగా గడిపారు. ఒంటిగంట సమయంలో నడక మార్గంలో వెనుదిరిగారు. మరో పది నిమిషాల్లో తుపాకీ కాల్పుల మోతలు వినిపించాయి. దీంతో తీవ్ర భయాందోళన చెంది పరుగులు తీశారు. రాత్రి 10 గంటలకు జమ్ము చేరుకున్నారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు, అక్కడి నుంచి విశాఖకు విమానంలో వచ్చి అనకాపల్లిలో ఇంటికి చేరుకున్నారు. మరికొంతసేపు పహల్గాం వుండి వుంటే పరిస్థితి ఏ విధంగా వుండేదో తలుచుకుంటేనే భయమేస్తున్నదని శ్రీబాలాజీ అన్నారు.