దేశ ఐక్యతను ప్రపంచానికి చాటాలి
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:02 AM
దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు.
కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ పిలుపు
జిల్లా కేంద్రంలో ఘనంగా జాతీయ ఐక్యతా దినోత్సవం
పాడేరు, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి):దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని జిల్లా కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అన్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం (వల్లభ్ భాయ్ పటేల్ జయంతి) పురస్కరించుకుని జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూనిటీ ఫర్ రన్ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ తొలి హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ 149వ జయంతిని ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామన్నారు. ఏకీకృత భారతదేశాన్ని నిర్మించేందుకు నాయకత్వం వహించారని పటేల్ సేవలను కలెక్టర్ కొనియాడారు. జాతీయ సమక్యత పట్ల ఆయనకున్న నిబద్ధత, స్ఫూర్తికి భారతదేశపు ఉక్కు మనిషి అనే పేరును తెచ్చిపెట్టిందన్నారు. దేశ సమగ్రతకు, ఐక్యతకు, భద్రతకు మేమంతా పాటుపడతామని పునరుద్ఘాటించేందుకే యూనిటీ ఫర్ రన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈసందర్భంగా జిల్లా ఎస్‌పీ అమిత్‌బర్దార్, ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ వల్లభ్ భాయ్ పటేల్ సేవలను కొనియాడారు. అనంతరం పట్టణవీధుల్లో యూనిటీ ఫర్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డీఎస్‌పీ షహబాజ్ అహ్మద్, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశఽ్వరరావు, ఏవో హేమలత, ఆర్‌డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.