ఉపాధి హామీలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపాం
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:51 PM
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు.
‘సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్’ కార్యక్రమంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
రూ.728 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
పాడేరు, జూన్ 11(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని, ఉపాధి హామీ పథకం అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపామని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ‘సుపరిపాలన- స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరిట బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది జిల్లాలో రూ.600 కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఏడాదిలో రూ.250 కోట్లతో భూములను అభివృద్ధి చేశామని, ఆయా భూముల్లో కాఫీ, మిరియాలు, రాజ్‌మా పంటలను సాగు చేయాలని సూచించారు. గతేడాది ఉపాధి శ్రామికులకు 65 శాతం పనులను కల్పించామని, జాబ్ కార్డుదారులకు 100 రోజులు పని దినాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి విజన్ స్వర్ణాంధ్ర- 2047 అమలు చేస్తున్నారని, అందుకు సచివాలయం, మండల, జిల్లా స్థాయిల్లో విజన్ డాక్యుమెంట్ రూపొందించామని చెప్పారు. గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు రానున్న మూడేళ్లలో లక్ష ఎకరాల్లో కాఫీ తోటల విస్తరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ ఏడాది 30 ఎకరాల్లో కాఫీ సాగును విస్తరిస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాడేరులో యోగా కేంద్రాలు లేవని, యువతకు యోగా సాధన కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ, రోడ్లు, భవనాలు, చిన్న నీటి పారుదల శాఖ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ వంటి విభాగాల్లో ఈ ఏడాదిలో రూ.728 కోట్లతో చేపట్టిన పనులకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్‌గౌడ, ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్నుదొర, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు, చిన్ననీటి పారుదల శాఖ ఈఈ ఆర్.రాజేశ్వరరావు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖ ఈఈ కె.వేణుగోపాల్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాల సుందరబాబు, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, ఉపాధి హామీ శ్రామికులు, గ్రామైక్య సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.