Share News

వాటర్‌షెడ్‌ నిధులు స్వాహా

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:59 PM

మండలంలో సమగ్ర వాటర్‌షెడ్‌ యాజమాన్య పథకం కింద కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి.

వాటర్‌షెడ్‌ నిధులు స్వాహా
గంగవరంలో ఏర్పాటు చేసిన నాసిరకం సోలార్‌ లైటు

ఐదు పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపణలు

నాణ్యత లేని సిమెంట్‌ బెంచీలు, నాసిరకం సోలార్‌ లైట్లు వేసిన వైనం

ఉన్నతాధికారులు పరిశీలనకు వచ్చినప్పుడు కేవలం కించవానిపాలెం, గంగవరంలో తవ్విన నీటి కుంటలు చూపిస్తున్న సిబ్బంది

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే నిజాలు నిగ్గు తేలే అవకాశం

కొయ్యూరు, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలో సమగ్ర వాటర్‌షెడ్‌ యాజమాన్య పథకం కింద కేటాయించిన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు రికార్డుల్లో చూపించిన లెక్కలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

ఐటీడీఏ పరిధిలో కరువు పీడిత, వర్షపాతం తక్కువ, వర్షాధార భూములు, బీడు భూములు భౌగోళికంగా ఎత్తు పల్లాలు ఉన్న ప్రాంతాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు నిర్దేశించిన సమగ్ర వాటర్‌షెడ్‌ యాజమాన్య పథకం నిధులు మండలంలో పక్కదారి పట్టాయనే విమర్శలున్నాయి. మండలంలో వాటర్‌షెడ్‌ పథకం కింద 2021-22 సంవత్సరంలో కొయ్యూరు, మర్రివాడ, మంప, రావణాపల్లి, రేవళ్లు పంచాయతీలలో ఐదు వేల హెక్టార్లు అభివృద్ధి చేసేలా రూ.11 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.3.76 కోట్లు వెచ్చించి సహజ వనరుల సంరక్షణ చర్యల్లో భాగంగా 12 విడి రాతి కట్టడాలు, 7 రాక్‌ఫిల్డ్‌ డ్యామ్‌లు, 19 గ్యాబియానులు, 29 చిన్న ఊట కుంటలు, 43 పెద్ద ఊట కుంటలు, 3 చెక్‌డ్యామ్‌లు, 41 ఫారంపాండ్స్‌, 2 అమృత సరోవర్‌లు నిర్మించినట్టు సంబంధిత వాటర్‌షెడ్‌ సిబ్బంది రికార్డులు రూపొందించారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణ చర్యల్లో భాగంగా రూ.50.82 లక్షలతో 618 వ్యవసాయ పరికరాలైన బరకాలు, బ్రష్‌ కట్టర్లు, బ్యాటరీ స్ర్పేయర్లు, తైౖవాన్‌ స్ర్పేయర్లు, ఆయిల్‌ ఇంజన్లు పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. ఈ పథకం అమలు చేసే ఐదు పంచాయతీలలో 95 మంది రైతులతో 101 ఎకరాల్లో హార్టీకల్చర్‌ ప్లాంటేషన్‌(జీడి మామిడి 77 ఎకరాలు, మామిడి 4 ఎకరాలు, కొబ్బరి 14 ఎకరాలు, సపోటా 2 ఎకరాలు, నిమ్మ 3 ఎకరాలు) చేయించామని అంటున్నారు. అయితే ఈ పనుల పరిశీలనకు ఉన్నతాధికారులు వచ్చిన సందర్భాలలో కేవలం మంప పంచాయతీ పరిధి కించవానిపాలెం, గంగవరంలో తవ్విన చిన్న, పెద్ద నీటి కుంటలు మాత్రమే చూపిస్తూ పబ్బం గడుపుతున్నారు తప్పితే, నిర్మించిన చెక్‌డ్యామ్‌లు, హార్టీకల్చర్‌ ప్లాంటేషన్‌ లబ్ధిదారులకు పంపిణీ చేసిన వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల విషయాన్ని ప్రస్తావనకు తేవడం లేదు.

సోలార్‌ లైట్ల లెక్కల్లో తేడాలు

ఐదు పంచాయతీల పరిధిలో ఒక్కో సోలార్‌ లైట్‌కు రూ.26,700లతో మొత్తం రూ.16.81 లక్షలు వెచ్చించి 63 సోలార్‌ వీధి దీపాలు వేయించారు. అయితే ఈ సోలార్‌ లెడ్‌ లైట్‌ రూ.8 వేలకు మించి లేకపోగా, ఒక్కో దానికి రూ.26 వేలు పైబడి ఖర్చు చూపించారు. ప్రస్తుతం ఐదు పంచాయతీల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ లెడ్‌ లైట్‌ ఆన్‌లైన్‌లో రూ.2,600 నుంచి రూ.5,790 వరకు ఉన్నాయి. దీనిని బట్టి చూస్తే సోలార్‌ లైట్లలో రూ.10 లక్షల మేర నిధులు పక్కదారి పట్టినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే ఐదు పంచాయతీల పరిధిలో రైతులు సేదతీరేందుకు వీలుగా 136 సిమెంట్‌ బెంచీలను రూ.5.07 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినట్టు చెబుతున్నారు. ఒక్కో సిమెంట్‌ బెంచీ రూ.3,700 వంతున కొన్నట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సిమెంట్‌ బెంచీ ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ.2 వేల నుంచి రూ.2,500 మధ్యలో దొరుకుతుండగా, నాణ్యత లేని బెంచీలు ఏర్పాటు చేసి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఐదు పంచాయతీల పరిధిలో చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అవినీతి ఆరోపణలపై నిగ్గు తేల్చాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 23 , 2025 | 11:59 PM