నీటి సరఫరా కార్మికుల సమ్మె వాయిదా
ABN , Publish Date - Jun 12 , 2025 | 01:14 AM
జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అవుట్‌సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. నీటిసరఫరా విభాగంలో స్కిల్డ్ వర్కర్లుగా పనిచేస్తున్న సుమారు 900 మందికి జీతాల పెంపునకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించినప్పటికీ, ఆడిట్ అధికారులు నిలుపుదల చేయడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
పది రోజుల్లో కొత్త వేతనాలు ఇచ్చేందుకు మేయర్, ఇన్‌చార్జి కమిషనర్ హామీ
విశాఖపట్నం, జూన్ 11 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో అవుట్‌సోర్సింగ్ కార్మికులు బుధవారం నుంచి నిర్వహించతలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యూనియన్ నేతలు ప్రకటించారు. నీటిసరఫరా విభాగంలో స్కిల్డ్ వర్కర్లుగా పనిచేస్తున్న సుమారు 900 మందికి జీతాల పెంపునకు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదించినప్పటికీ, ఆడిట్ అధికారులు నిలుపుదల చేయడంతో బుధవారం తెల్లవారుజాము నుంచి విధులను బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అవుట్‌సోర్సింగ్ విభాగం సిబ్బంది సమ్మెకు దిగితే నగరంలో నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. మేయర్ పీలా శ్రీనివాసరావుతోపాటు, ఇన్‌చార్జి కమిషనర్, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్మిక సంఘాల నేతలతో మంగళవారం రాత్రి మేయర్ పీలా శ్రీనివాసరావు ఫోన్‌లో చర్చలు జరిపారు. పది రోజుల్లో కొత్తవేతనాలను కార్మికులకు అందేలా చర్యలు తీసుకుంటామని, అంతవరకు సమ్మె ఆలోచన విరమించుకోవాలని కోరారు. దీంతో కార్మిక సంఘాల నేతలు సమ్మెను విరమిస్తున్నట్టు మంగళవారం అర్ధరాత్రే ప్రకటించారు. కార్మికులందరినీ విధుల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించడంతో బుధవారం నీటి సరఫరా యథావిధిగా జరిగింది.