Share News

నీటి సరఫరా బంద్‌

ABN , Publish Date - Jun 28 , 2025 | 01:09 AM

నగరంలో 90 శాతం ప్రాంతాలకు శుక్రవారం నీటి సరఫరా నిలిచిపోయింది.

నీటి సరఫరా బంద్‌

  • జనం గగ్గోలు

  • పరిశ్రమల్లో ఉత్పత్తికి అంతరాయం

  • నీటి సరఫరా విభాగంలో అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మె

  • ఫలించని మేయర్‌ చర్చలు...

  • నేడు కూడా కొనసాగించనున్నట్టు ప్రకటన

  • ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారుల దృష్టి

  • వార్డు సచివాలయాల సిబ్బందికి బాధ్యతలు..అయినా అనుమానమే

  • నగరంలో లేని కొత్త కమిషనర్‌

  • నాయకులకు పట్టని ప్రజల ఇక్కట్లు

విశాఖపట్నం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి):

నగరంలో 90 శాతం ప్రాంతాలకు శుక్రవారం నీటి సరఫరా నిలిచిపోయింది. ఒక్క స్టీల్‌ ప్లాంటు మినహా జిల్లాలో మిగిలిన పరిశ్రమలన్నీ నీటికి కటకటలాడాయి. చాలా వాటిల్లో ఉత్పత్తికి విఘాతం కలిగింది. జీవీఎంసీలో నీటి సరఫరా విభాగంలో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది సమ్మెకు దిగడమే దీనికి ప్రధాన కారణం.

వేతనాలు పెంచాలని అవుట్‌సోర్సింగ్‌ కార్మికులు చాలాకాలంగా కోరుతుండగా, గత డిసెంబరులో నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించారు. ఒక్కొక్కరికి రూ.6 వేలు చొప్పున జీతం పెంచుతామని హామీ ఇచ్చారు. ఆ విభాగంలో మొత్తం 1,274 మంది పనిచేస్తుండగా దీనివల్ల 900 మందికి ప్రయోజనం కలుగుతుంది. మే నెల నుంచి జీతాలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అయితే అకౌంట్స్‌ విభాగం దీనికి అభ్యంతరం వ్యక్తంచేస్తుంది. ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండా కేవలం కౌన్సిల్‌ తీర్మానంతో వేతనాలు పెంచడానికి అవకాశం లేదని ఆ ఫైల్‌ను ఆపేసింది. దాంతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మే నెలకు సంబంధించి పాత జీతాలే వచ్చాయి. దాంతో వారు సమ్మెకు దిగుతామని ఈ నెల మొదటి వారంలో ప్రకటించారు. నగరంలో యోగాంధ్ర కార్యక్రమం ఉన్నందున 15 రోజులు సమయం కావాలని మేయర్‌ పీలా శ్రీనివాసరావు వారిని కోరారు. అయితే తాజాగా జూన్‌ నెలకు సంబంధించిన వేతనాలు కూడా పాత విధానంలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలియడంతో జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌, లేబర్‌ యూనియన్‌ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్టు గురువారం ప్రకటించింది. ఈ విషయం తెలిసినా అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గానీ వారితో సంప్రతింపులు జరపలేదు. దాంతో కార్మికులు చెప్పినట్టుగానే శుక్రవారం సమ్మెకు దిగడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దాంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందిపడ్డారు. నగరంలో పెద్ద పెద్ద అపార్టుమెంట్లన్నీ జీవీఎంసీ నీటిపైనే ఆధారపడుతున్నాయి. వాటిలో వేలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. చాలా అపార్టుమెంట్లలో ట్యాంకులు ఖాళీ అయిపోయాయి. బయట నుంచి తెప్పించుకుందామన్నా అక్కడ కూడా సిబ్బంది సమ్మెలో ఉన్నారు.

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గర్గ్‌ నగరంలో లేరు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇతర ప్రాంతాల పర్యటనలో ఉన్నారు. మిగిలిన ప్రజా ప్రతినిధులు నగరానికి ఇద్దరు మంత్రులు రావడంతో వారితో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మేయర్‌ పీలా శ్రీనివాసరావు కార్మిక సంఘాలతో చర్చలు జరపగా, వారు పెంచిన జీతాలు ఈ నెల నుంచి ఇస్తేనే పనిచేస్తామని, అంతవరకు సమ్మెలోనే ఉంటామని చెప్పి బయటకు వచ్చేశారు. దాంతో శనివారం కూడా నీటి సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఎదురైంది. చాలామంది ప్రజా ప్రతినిధులకు నగరంలో నీటి సరఫరా లేదని, ఉద్యోగులు సమ్మె చేస్తున్నారనే విషయం కూడా తెలియకపోవడం గమనార్హం.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు...ఫలితం అంతంత మాత్రం

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు తమ మాట వింటారని ఉన్నతాధికారులు ధీమాగా ఉండి శుక్రవారం సాయంత్రం వరకూ ఏమీ పట్టించుకోలేదు. వారు సమ్మె కొనసాగిస్తామని స్పష్టంచేయడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టిపెట్టారు. ఉద్యోగులు ఎవరూ సెలవులు తీసుకోవద్దని సూచించారు. ఇంజనీరింగ్‌ విభాగం అంతా అప్రమత్తంగా ఉండి, వార్డు సచివాలయాల ఎమినిటీస్‌ (సౌకర్యాలు) కార్యదర్శితో నీటి సరఫరాను పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. 98 వార్డులను సందర్శిస్తూ నీరు అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. జోనల్‌ కమిషనర్లకు బాధ్యతలు అప్పగించారు.

నీటి సరఫరా వీజీ కాదు

నగరానికి నీటి సరఫరా చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు. రైవాడ, తాటిపూడి రిజర్వాయర్ల వద్ద నీటి పంపింగ్‌ను పర్యవేక్షించే సిబ్బంది ఉండాలి. ఏలేరు కాలువ నుంచి గ్రావిటీ ద్వారా వచ్చే నీటిని నిర్వహించే వారు ఉండాలి. అక్కడి నుంచి వచ్చిన నీటిని నగరంలో గల రెండు వేలకు పైగా ట్యాంకులకు ఎక్కించాలి. ఆ నీటిని మళ్లీ బూస్టర్‌ పంపింగ్‌ స్టేషన్ల ద్వారా సరఫరా చేయాలి. ప్రతి వార్డుకు టర్న్‌ కాక్‌లు వెళ్లి నీటి సరఫరా వాల్వ్‌లు విప్పితేనే ఆ ప్రాంతానికి నీరు అందుతుంది. ఈ క్రమంలో వాల్వ్‌ చెకర్లు, వాటర్‌ క్వాలిటీ తనిఖీ చేసేవారు ఇంకా అనేక మంది పనిచేయాల్సి ఉంటుంది. పై నుంచి నీరు రాకుండా వార్డు సచివాలయాల సిబ్బంది ఏమీ చేయలేరు. అత్యంత అవసరమైన తాగునీటి సరఫరాలో అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంపై ప్రజలతో పాటు పరిశ్రమలనిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల సమ్మెను విరమింపజేసి శనివారం యథాప్రకారం నీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నేడు మేయర్‌తో చర్చలు

విశాఖపట్నం, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి):

అవుట్‌సోర్సింగ్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో మేయర్‌ పీలా శ్రీనివాసరావుతో కార్మిక సంఘ నాయకులు శనివారం ఉదయం చర్చలు నిర్వహించనున్నారు. జూన్‌ నెల నుంచి వేతనాలు పెంచడంతోపాటు జనవరి నుంచి ఎరియర్స్‌ కూడా చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఇదిలావుండగా శుక్రవారం చర్చలు ఫలించనందున శనివారం సమ్మె యథావిధిగా సాగుతుందని జీవీఎంసీ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల, కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎం.ఆనందరావు తెలిపారు.

పరిశ్రమలకు మినహాయింపు

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సమ్మె నుంచి పరిశ్రమలకు మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ శుక్రవారం రాత్రి కార్మిక సంఘ నేతలతో చర్చలు జరిపారు. పరిశ్రమలకు ఇబ్బందిలేకుండా నీటి సరఫరాకు కార్మిక సంఘాల నేతలు అంగీకరించారు.

Updated Date - Jun 28 , 2025 | 01:09 AM