Share News

డొంకరాయి నుంచి నీరు విడుదల

ABN , Publish Date - Oct 27 , 2025 | 10:27 PM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు సోమవారం నుంచి విడుదల చేస్తున్నారు.

డొంకరాయి నుంచి నీరు విడుదల
డొంకరాయి జలాశయం నుంచి నీరు విడుదల చేసిన దృశ్యం

జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీరు దిగువకు..

నీటిమట్టం 1,030 అడుగులకు తగ్గే వరకు కొనసాగింపు

ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు

సీలేరు/మోతుగూడెం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని జెన్‌కో అధికారులు సోమవారం నుంచి విడుదల చేస్తున్నారు. మొంథా తుఫాన్‌ నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా జలాశయం నుంచి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో సీఈ రాజారావు తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగుల కాగా, ఇటీవల కురుస్తున్న వర్షాలకు 1,036.50 అడుగులకు చేరిందన్నారు. తుఫాన్‌ నేపథ్యంలో డ్యాం సేఫ్టీ నిపుణుల ఆదేశాల మేరకు జలాశయం నీటిమట్టం 1,030 అడుగులకు తగ్గించే చర్యల్లో భాగంగానే 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం డొంకరాయి జలాశయానికి 10 వేలు నుంచి 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. కాంప్లెక్సు పరిధిలోని జోలాపుట్‌, సీలేరు జలాశయాల వద్ద కూడా జెన్‌కో అధికారులను అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు వరద నీటిని పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన తెలిపారు.

జోలాపుట్టు నుంచి 18 వేల క్యూసెక్కులు నీరు దిగువకు..

ముంచంగిపుట్టు: ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల నుంచి భారీగా నీరు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా జలాశయాల్లో గరిష్ఠ స్థాయిలో నీటిమట్టం నమోదు కావడం, తుఫాన్‌ కారణంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ముందస్తు చర్యల్లో భాగంగా నీరు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. జోలాపుట్టు జలాశయంలో 2,750 అడుగుల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2747.95 అడుగులకు చేరింది. ఇక్కడ నుంచి మూడు గేట్లు ఎత్తి దిగువ ప్రాంతంలో గల డుడుమకు 18 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయంలో 2,590 అడుగులు నీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం 2,583.60 అడుగులకు చేరింది. ఇక్కడ నుంచి బలిమెలకు 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 10:27 PM