డొంకరాయి నుంచి నీరు విడుదల
ABN , Publish Date - Oct 14 , 2025 | 10:52 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి దిగువకు 1,000 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి విడుదల చేస్తున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు.
ఎగువన కురుస్తున్న వర్షాలకు పెరుగుతున్న నీటిమట్టం
అప్రమత్తమైన జెన్‌కో అధికారులు
జలాశయం ఆరవ నంబర్ గేటు ఎత్తి 1,000 క్యూసెక్కుల నీరు దిగువకు..
సీలేరు/మోతుగూడెం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి దిగువకు 1,000 క్యూసెక్కుల నీటిని మంగళవారం నుంచి విడుదల చేస్తున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. డొంకరాయి పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా, అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా డొంకరాయి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంగళవారం నాటికి 1,036.50 అడుగులకు నీటిమట్టం చేరింది. దీంతో జెన్‌కో అధికారులు అప్రమత్తమై జలాశయం నీటి మట్టం ప్రమాదస్థాయికి చేరుకోకుండా 1,036.50 అడుగుల వద్ద స్థిరంగా నీటిమట్టం కొనసాగేలా జలాశయం ఆరవ నంబర్ గేటు ద్వారా దిగువకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే పొల్లూరు జల విద్యుత్ కేంద్రానికి విద్యుదుత్పత్తి కోసం డొంకరాయి పవర్ కెనాల్ ద్వారా మరో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్‌కో అధికారులు తెలిపారు. కురుస్తున్న వర్షాలకు డొంకరాయి జలాశయానికి 5 వేల క్యూసెక్కుల వరకు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నదని అధికారులు వెల్లడించారు.