Share News

డొంకరాయి నుంచి నీటి విడుదల నిలిపివేత

ABN , Publish Date - Dec 02 , 2025 | 12:38 AM

సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్‌ కెనాల్‌ నుంచి నీటి విడుదలను రెండు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు.

డొంకరాయి నుంచి నీటి విడుదల నిలిపివేత
డొంకరాయి పవర్‌ కెనాల్‌

పొల్లూరులో నిర్మించనున్న రెండు యూనిట్లకు వాటర్‌ కండక్టర్‌ సిస్టం ఏర్పాటు కోసం..

పొల్లూరు, డొంకరాయిలో విద్యుదుత్పత్తికి బ్రేక్‌

సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు

సీలేరు/మోతుగూడెం, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రానికి నీటిని సరఫరా చేసే డొంకరాయి పవర్‌ కెనాల్‌ నుంచి నీటి విడుదలను రెండు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు సీలేరు కాంప్లెక్సు ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 115 మెగావాట్ల సామర్థ్యం (ఒక్కొక్కటి) గల 5, 6 రెండు యూనిట్లకు కమిషనింగ్‌ పనుల్లో భాగంగా ఆ రెండు యూనిట్లకు ఫోర్‌బే డ్యాం నుంచి పెన్‌స్టాక్‌ పైప్‌లైన్‌ ద్వారా నీరు పంపడానికి అవసరమైన వాటర్‌ కండక్టర్‌ సిస్టంను ఫోర్‌బే ఇంటెక్‌ వద్ద ఏర్పాటు చేయాలన్నారు. ఈ పనులు చేయాలంటూ డొంకరాయి పవర్‌ కెనాల్‌ నుంచి వచ్చే నీటి విడుదలను పూర్తిగా నిలిపివేయాలని ఆయన తెలిపారు. దీని కోసం డిసెంబరు 2 నుంచి రెండు నెలల పాటు నీరు నిలిపివేతకు ఏపీ జెన్‌కో గ్రిడ్‌ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు తీసుకున్నామన్నారు. ఈ రెండు నెలల పాటు 460 మెగావాట్ల సామర్థ్యం గల పొల్లూరు, 25 మెగావాట్ల సామర్థ్యం గల డొంకరాయి జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుదుత్పత్తిని నిలిపివేయనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఈ షట్‌డౌన్‌ సమయంలో పొల్లూరు జల విద్యుత్‌ కేంద్రంలో గల 115 మెగావాట్ల సామర్థ్యం గల నాలుగు యూనిట్లకు కొన్ని ఆపరేషన్‌ నిర్వహణ పనులు చేయడానికి ప్రతిపాదనలు చేశామన్నారు. అలాగే 25 మెగావాట్ల సామర్థ్యం గల డొంకరాయి మినీ జలవిద్యుత్‌ కేంద్రంలో యూనిట్‌ క్యాపిటల్‌ ఓవరాయిలింగ్‌ పనులను కూడా నిర్వహించనున్నామని చెప్పారు. డొంకరాయి నుంచి ఫోర్‌బే వరకు గల 16 కిలోమీటర్ల పవర్‌ కెనాల్‌ ఒకటి, రెండు రీచ్‌ల్లో సీపేజీని నిలిపివేయడం కోసం నిర్వహణ పనులను కూడా నిర్వహిస్తున్నామన్నారు. సీలేరు కాంప్లెక్సు పరిధిలో ఈ రెండు నెలల పాటు విడ్యుత్‌ డిమాండ్‌, గ్రిడ్‌ అధికారుల ఆదేశాల మేరకు ఎగువ సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో మాత్రమే విద్యుదుత్పత్తి జరుగుతుందని ఆయన చెప్పారు.

Updated Date - Dec 02 , 2025 | 12:38 AM