జలాశయాల నుంచి నీరు విడుదల
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:26 PM
ఆంధ్రా, ఒడిశా రష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా ఆ రెండు జలాశయాల్లోకి వరద నీరు అధికంగా వచ్చి చేరుతోంది.
జోలాపుట్టు నుంచి 12 వేలు, డుడుమ నుంచి 6 వేల క్యూసెక్కులు దిగువకు..
ముంచంగిపుట్టు, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా, ఒడిశా రష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు, డుడుమ జలాశయాల్లో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా ఆ రెండు జలాశయాల్లోకి వరద నీరు అధికంగా వచ్చి చేరుతోంది. దీంతో నీటి నిల్వలు గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జోలాపుట్టు జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,750 అడుగులు కాగా, మంగళవారం 2,748.50 అడుగులకు చేరింది. ఈ క్రమంలో జోలాపుట్టు స్పిల్‌వే డ్యాం నుంచి రెండు గేట్లు ఎత్తి వేసి 6 వేల క్యూసెక్కులు, ప్రధాన జలాశయం నుంచి 6 వేల క్యూసెక్కులు.. మొత్తం 12 వేల క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతంలో గల డుడుమ జలాశయానికి విడుదల చేస్తున్నారు. అలాగే డుడుమ జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2,590 అడుగులు కాగా, ప్రస్తుతం 2,587.75 అడుగులకు చేరింది. దీంతో ఈ జలాశయానికి చెందిన 5, 6, 7 నంబర్లు గల గేట్లను ఎత్తివేసి ఆరు వేల క్యూసెక్కుల నీటిని ఈ జలాశయం దిగువన ఉన్న బలిమెలకు విడుదల చేస్తున్నారు. జోలాపుట్టు ప్రాజెక్టు ఏఈ సర్వేశ్వరరావు పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. గంట, గంటకు నీటి నిల్వల స్థాయిని అంచనా వేస్తున్నారు. వర్షం రాత్రి వరకు ఏకధాటిగా కురవడం, వరద నీరు ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడం వలన మరిన్ని క్యూసెక్కుల నీటిని దశలవారీగా విడుదల చేసే అవకాశం ఉందని ఏఈ తెలిపారు.