‘డొంకరాయి’ నుంచి నీటి విడుదల
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:52 PM
సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి శరెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్‌కో ఏఈఈ శివశంకర్ తెలిపారు.
గురువారం ఆరు వేల క్యూసెక్కులు..
శుక్రవారం నుంచి 2 వేల క్యూసెక్కులు..
జోలాపుట్, బలిమెల జలాశయాల్లో
ఆశాజనకంగా నీటి నిల్వలు
సీలేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్సు పరిధిలోని డొంకరాయి జలాశయం నుంచి శరెండు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్టు జెన్‌కో ఏఈఈ శివశంకర్ తెలిపారు. గురువారం అల్పపీడన ప్రభావంతో ఎగువన కురిసిన భారీ వర్షానికి డొంకరాయి జలాశయానికి ఇన్‌ఫ్లో పెరగడంతో గురువారం నీటిమట్టం 1035.70 అడుగులకు చేరింది. దీంతో ఉదయం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు ఆరు వేల క్యూసెక్కులు విడుదల చేశామన్నారు. శుక్రవారం ఉదయం 8 గంటల సమయానికి నీటిమట్టం 1034.80 అడుగులకు చేరడంతో నీటి విడుదలను 6 వేల క్యూసెక్కుల నుంచి 2 వేల క్యూసెక్కులకు తగ్గించినట్టు ఆయన తెలిపారు. అలాగే పొల్లూరు జలవిద్యుత్ కేంద్రానికి డొంకరాయి పవర్ కెనాల్ ద్వారా మరో 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని ఏఈఈ శివశంకర్ తెలిపారు. కాగా కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జోలాపుట్, బలిమెల జలాశయాల్లోకి ఆశాజనకంగా నీటి నిల్వలు చేరాయి. బలిమెల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,750 అడుగులు కాగా శుక్రవారం నాటికి 2748.70 అడుగులకు చేరింది. ప్రస్తుతం జోలాపుట్‌లో 30.3990 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. అలాగే బలిమెల పూర్తిస్థాయి నీటిమట్టం 1,516 అడుగులు కాగా శుక్రవారం నాటికి ఇక్కడ 1500.40 అడుగులకు చేరింది. దీంతో ఇక్కడ 88.10000 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. బలిమెల, జోలాపుట్ జలాశయాల్లో ఆంధ్రా వాటాగా 54.3566 టీఎంసీలు, అలాగే గుంటువాడ, డొంకరాయి జలాశయాల్లో కలిసి మరో 14.8558 టీఎంసీల నిల్వలు ఉన్నాయని, మొత్తంగా సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్ కేంద్రాల్లో 69.2234 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాదికి సీలేరు కాంప్లెక్సులోని జలవిద్యుత్ కేంద్రాలకు నీటి కొరత ఉందబోదని వారు తెలిపారు.