‘భూమి’ రైతుకు నీటి కష్టాలు!
ABN , Publish Date - Jun 10 , 2025 | 01:58 AM
తాండవ నదిపై పాయకరావుపేట వద్ద ఉన్న భూమి ఆనకట్ట కింద వున్న పంట కాలువల్లో పూడిక విపరీతంగా పేరుకుపోయింది.

ఆనకట్ట కాలువలో పేరుకుపోయిన పూడిక, పెరిగిన తుప్పలు
నీటి ప్రవాహానికి ఆటంకాలు
ఆయకట్టుకు సరిగా నీరు అందక రైతుల ఇక్కట్లు
పాయకరావుపేట, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
తాండవ నదిపై పాయకరావుపేట వద్ద ఉన్న భూమి ఆనకట్ట కింద వున్న పంట కాలువల్లో పూడిక విపరీతంగా పేరుకుపోయింది. తుప్పలు బలిసిపోయాయి. దీంతో కాలువల్లో నీరు సరిగా ప్రవహించక ఆయకట్టు భూములకు నీరు అందని పరిస్థితి నెలకొంది. మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ ప్రారంభం కానుండడం, ఇంతవరకు పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.
పాయకరావుపేట వద్ద తాండవ నదిలో పూర్వం కాలంలో ఉన్న గోయిన్లను తొలగించి సుమారు రెండు దశాబ్దాల క్రితం భూమి, ముఠా ఆనకట్టలను నిర్మించారు. వీటి ద్వారా ఏటా ఖరీఫ్ సీజన్‌లో పాయకరావుపేట, నక్కపల్లి మండలాలతోపాటు కాకినాడ జిల్లా తుని మండలంలో సుమారు 18 వేల ఎరాలకు నీరు అందాలి. భూమి ఆనకట్ట కింద పాయకరావుపేట, పీఎల్.పురం, సీతారాంపురం, నామవరం, నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట, దేవవరం, గొడిచెర్ల, ఉద్దండపురం తదితర గ్రామాల్లో సుమారు మూడు వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఆనకట్టల నిర్మాణ సమయంలో గేట్ల ఏర్పాటులో సాంకేతిక లోపంతో ఏటా వర్షా కాలంలో నీరు వృథాగా పోతున్నది. దీంతో పొలాలకు సకాలంలో పూర్తిస్థాయిలో నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
ఇదిలావుండగా తాండవ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో తాండవ నదిపై పోలవరం ఎడమ కాలువ అక్విడక్టు నిర్మాణంలో భాగంగా భూమి ఆనకట్ట వద్ద నదిలో పదేళ్ల కిత్రం కొండను తలపించేంతగా వేసిన రాళ్ల గుట్టలను ఇప్పటికీ తొలగించలేదు. దీంతో ఆనకట్ట వద్ద నదిలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. దీనికి తోడు ఆనకట్ట వద్ద నుంచి నక్కపల్లి మండలం ఉద్దండపురం వరకు ఉన్న పంట కాలువ పలుచోట్ల ఆక్రమణకు గురవడం, పిచ్చిమొక్కలు పెరిగిపోవడం, కాలువ ఇరువైపులా ఉన్న నివాసితులు వ్యర్థాలను వేస్తుండడంతో పూడిక పెరిగిపోతున్నది. ఏటా పూడిక తొలగించని కారణంగా కాలువలో నీటి ప్రవాహం తగ్గిపోయి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరు అందని పరిస్థితి ఏర్పడుతున్నది. కాలువ చివరి భూముల రైతులు వరినాట్లు వేయడానికి వర్షంపై ఆధారపడాల్సి వస్తున్నది. 2022లో ఆయకట్టు రైతుల విజ్ఞప్తి మేరకు అప్పటి అనకాపల్లి ఎంపీ సత్యవతి ఎంపీ గ్రాంట్ రూ.10 లక్షలు మంజూరు చేయడంతో అప్పల్లో కాలువల పూడిక తీయించారు. ఇంతకు మించి వైసీపీ ఐదేళ్ల పాలనలో కాలువల్లో పూడిక తీసిన పాపాన పోలేదు. గుంటపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నియోకవర్గం ఇన్‌చార్జి గెడ్డం బుజ్జి స్వొంత నిధులు వెచ్చించడంతోపాటు రైతుల శ్రమదానంతో పాయకరావుపేట వద్ద కాలువలో పూడికలు తీయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భూమి పంట కాలువలో పూడిక, తుప్పలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయకట్టు కోరుతున్నారు.