జలం.. పుష్కలం
ABN , Publish Date - Dec 02 , 2025 | 01:18 AM
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో నగరం, పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగాయి.
జిల్లాలో భారీగా పెరిగిన భూగర్భజలాలు
మేలు చేసిన మొంథా తుఫాన్
జిల్లాలో సగటు భూగర్భజల మట్టం 4.37 మీటర్లు
గత ఏడాది నవంబరు కంటే 1.26 మీటర్లు పెరుగుదల
ఎండాడ, ఆరిలోవ, మధురవాడ, రుషికొండలో ఆందోళనకరమే!
రీచార్జి పిట్‌లు ఏర్పాటు చేసుకోవాలన్న భూగర్భజల శాఖ
విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో నగరం, పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు సమృద్ధిగా పెరిగాయి. ఈ ఏడాది అక్టోబరు మూడో వారం వరకు చెప్పుకోదగ్గ వర్షాలు లేవు. ఆనెల చివరివారంలో మొంథా తుఫాన్‌తో కురిసిన వర్షాలు ఆదుకున్నాయి. దీంతో భూగర్భజల మట్టాలు భారీగానే పెరిగాయి.
ఈ ఏడాది జిల్లాలో సగటున అక్టోబరు మాసంలో భూగర్భ జల మట్టం 5.43 మీటర్లలోతుండగా, నవంబరుమూడో వారానికి 4.37 మీటర్లకు పెరిగింది. గత ఏడాది నవంబరులో సగటున 5.6 మీటర్లలోతున జలాలుండగా ఈ ఏడాది నవంబరులో 4.37 మీటర్లకు పెరిగింది. దీంతో గత ఏడాది కంటే 1.26 మీటర్లు పెరిగాయి. దీంతో భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గింది. అయినప్పటికీ రుషికొండ, ఎండాడ, ఆరిలోవ, మధురవాడ, వడ్లపూడి కణితకాలనీ, తదితర జనసమ్మర్థ ప్రాంతాల్లో భూగర్భజలాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఫలితంగా గత ఏడాది కంటే మరింత లోతుకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో గత ఏడాది కంటే జలాలు పెరిగాయి. వేసవిలో వర్షాలు తగ్గడం, నీటి వినియోగం పెరగడంతో భూగర్భజలాలపై ఒత్తిడి పెరుగుతుంది. నగరంలో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో నీటి వినియోగం పెరుగుతోంది. ఎండాడ, మధురవాడ, రుషికొండ, కూర్మన్నపాలెంపరిసరాల్లో నగరంలో అనేకరేట్లు పెరిగింది. ఆరిలోవ హెల్త్ సిటీలో ఆస్పత్రులు అధికంగా నీటిని వినియోగిస్తుండడంతో అక్కడ భూగర్భజలాలు ఆందోళనకర స్థితికి పడిపోయాయి. దీంతో ఈ ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు 10 మీటర్ల కంటే లోతుకు వెళ్లిపోతున్నాయి.
మొంథా తుఫాన్‌తో కురిసిన వర్షాలకు భూగర్భజల మట్టాలు పెరగడం ఉపశమనం కలిగించింది. గత ఏడాది నవంబరులో ఆనందపురం మండలం పందలపాకలో 3.61 మీటర్ల లోతులో ఉండే భూగర్భజల మట్టం ఈ ఏడాది నవంబరులో 1.88 మీటర్లకు చేరింది. వెల్లంకిలో గత ఏడాది 6.79 మీటర్లు ఉండగా ఈ ఏడాది 1.75, శొంఠ్యాంలో 4.74 నుంచి 2.18 మీటర్ల పైకి వచ్చింది. భీమిలి మండలం నగరంపాలెంలో 4.63 మీటర్ల నుంచి 3.25 మీటర్లు, పద్మనాభం మండలం పాండ్రంకిలో 5.33 మీటర్ల నుంచి 3.26 మీటర్లకు, విశాఖ ఉక్కు కర్మాగార ప్రాంతంలో 4.08 మీటర్ల నుంచి 3.43 మీటర్లకు చేరుకుంది. పెందుర్తిలో 6.76 మీటర్ల నుంచి 3.94 మీటర్లు, మారికవలసలో 9.71 నుంచి 7.62, మధురవాడలో 11.63 నుంచి 10.51 మీటర్లు పైకి వచ్చింది. కాగా ఎండాడలో 12.73 మీటర్ల నుంచి 13.91 మీటర్లకు, గాజువాక కణితికాలనీలో 10.38 నుంచి 11.8 మీటర్లకు పడిపోయాయి. ఆరిలోవలో 15.06మీటర్ల నుంచి 14.1 మీటర్లకు, సెంట్రల్ పార్కులో 12.5 నుంచి 11.05 మీటర్లకు తగ్గినా నీటి వినియోగంపై ఒత్తిడి కొనసాగుతోంది.
రీచార్జి పిట్‌లు వినియోగించాలి
నగరంలో జనాభా పెరగడంతో నీటి వినియోగం ఎక్కువగా ఉంది. దీనికితోడుగా కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షం నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు క్షీణిస్తున్నాయి. జీవీఎంసీ సరఫరాచేసే నీటికి అదనంగా భూగర్భజలాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వినియోగానికి తగినట్టుగా నీరు భూమిలోకి ఇంకిపోవాలి. దీనికి అనుగుణంగా ప్రతి ఇంటి వద్ద రీచార్జి పిట్‌లు నిర్మించాలి. రాష్ట్రంలో భూగర్భజల మట్టం సగటున మూడు నుంచి ఎనిమిది మీటర్ల మధ్యన ఉండాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో రీచార్జి పిట్‌ల ఏర్పాటు, నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచాలి.
- బీఎస్‌ఎస్‌ఎన్ మూర్తి, జిల్లా భూగర్భ జలశాఖాధికారి
నేవీ డే లేనట్టే!
ఈ సారి సాహస విన్యాసాలకు దూరం
ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఆర్, మిలాన్‌ల నేపథ్యంలో రద్దు
విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళం ప్రతి ఏటా డిసెంబరు 4వ తేదీ సాయంత్రం రామకృష్ణా బీచ్‌లో నిర్వహించే సాహస విన్యాసాల ప్రదర్శన ఈ ఏడాది కనిపించే అవకాశం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు, రిహార్సళ్లు పూర్తయ్యేవి. విశాఖ గగన వీధుల్లో యుద్ధ విమనాలు చక్కర్లు కొట్టాల్సిన సమయం. కానీ ఈసారి వాటి జాడ లేదు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్-2026ను భారీఎత్తున నిర్వహించడానికి నేవీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రి, తదితర ప్రముఖులు హాజరవుతారు. ఇందులో సుమారు 50 దేశాలకు పైగా పాల్గొంటాయి. ఇవి అతి పెద్ద కార్యక్రమాలు కావడం, అప్పుడు కూడా ఆర్‌కే బీచ్‌లో నేవీ సాహస విన్యాసాలు నిర్వహించాల్సి ఉండడంతో తాజాగా నేవీ డే నిర్వహించడం లేదని తెలిసింది. గత ఏడాది ఒడిశాలోని పూరి తీరంలో నేవీ డే నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తరువాత జనవరి 4న విశాఖలో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్‌తో కలిసి హాజరయ్యారు.
6న జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం
విశాఖపట్నం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం ఈనెల ఆరోతేదీని నిర్వహించాలని మేయర్ పీలా శ్రీనివాసరావు నిర్ణ యించారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని కార్యదర్శి బీవీరమణను ఆదేశించారు. ఇప్పటివరకు 230 ప్రతిపాదనలు అజెండాలో చేర్చినట్టు తెలిసింది. శుక్రవారం వరకు ప్రతిపాదనలు స్వీకరించే అవకాశం ఉండడంతో అజెండాలో 300కిపైగా అంశాలుంటాయని భావిస్తున్నారు. కార్యదర్శి పేషీకి అందిన అంశా ల్లో యోగాంధ్రకు సంబంధించిన పనులకు బిల్లు చెల్లింపు అంశాలే ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.