జోలాపుట్టులో జలకళ
ABN , Publish Date - May 16 , 2025 | 12:37 AM
ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు జలాశయం నీటితో కళకళలాడుతోంది. ఈ ఏడాది మండు వేసవిలో సైతం భారీ వర్షాలు కురవడంతో జలాశయంలోకి వరదనీరు అధికంగా వచ్చి చేరుతోంది.
- గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 అడుగులు నీరు అధికం
ముంచంగిపుట్టు, మే 15(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి నీరందించే జోలాపుట్టు జలాశయం నీటితో కళకళలాడుతోంది. ఈ ఏడాది మండు వేసవిలో సైతం భారీ వర్షాలు కురవడంతో జలాశయంలోకి వరదనీరు అధికంగా వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నది. ఈ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం 2750 అడుగులు కాగా, గురువారం 2730.55 అడుగులు నీటిమట్టం నమోదైంది. గతేడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో 2607.95 అడుగులు నీటిమట్టం నమోదైందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 33 అడుగుల నీరు అధికంగా ఉందని వారు చెప్పారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు మత్స్యగెడ్డలో వరద నీరు వచ్చి చేరవడం, మత్స్యగెడ్డ ప్రవాహిత నీటిపై ఆధారపడి ఉన్న జోలాపుట్టు జలాశయంలో వరదనీరు ఇన్‌ఫ్లో పెరగడంతో ఈ ఏడాది మండు వేసవిలో సైతం గరిష్ఠ స్థాయిలో నీటిమట్టం నమోదైంది. ఈ ఏడాది మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి ఎటువంటి నీటి సమస్య తలెత్తే అవకాశం ఉండకపోవచ్చునని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మాచ్‌ఖండ్‌లో నాలుగు జనరేటర్ల సహాయంతో 80 మెగావాట్ల విద్యుదుత్పాదన చేస్తున్నారు.