Share News

జల కళ

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:02 AM

నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు మొంథా తుఫాన్‌ ప్రభావంతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. భారీవర్షాల కారణంగా ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుతుండడంతో రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. తాటిపూడి, మేహాద్రిగెడ్డలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు.

జల కళ

నిండిన రిజర్వాయర్లు

మొంథా తుఫాన్‌ ప్రభావంతో భారీగా ఇన్‌ఫ్లో

గరిష్ఠ స్థాయికి చేరువైన నిల్వలు

మేహాద్రిగెడ్డ, తాటిపూడి నుంచి దిగువకు నీరు విడుదల వచ్చే వేసవిలో నీటి ఎద్దడి ఉండబోదని జీవీఎంసీ అధికారుల వెల్లడి

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరానికి నీటిని అందించే రిజర్వాయర్లు మొంథా తుఫాన్‌ ప్రభావంతో నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. భారీవర్షాల కారణంగా ఎగువ నుంచి వరదనీరు పోటెత్తుతుండడంతో రిజర్వాయర్లు జలకళ సంతరించుకున్నాయి. తాటిపూడి, మేహాద్రిగెడ్డలో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో గేట్లను తెరిచి నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. మిగిలిన రిజర్వాయర్లలో ఇన్‌ఫ్లో ఆధారంగా నిర్ణయం తీసుకునేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నగర వాసులకు తాగునీరు, పరిశ్రమల అవసరాలను తీర్చే రిజర్వాయర్లలో ఏలేరు, రైవాడ, తాటిపూడి, మేహాద్రిగెడ్డ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లు ప్రధానమైనవి. వాటి నుంచి తాగునీటి కోసం ప్రతిరోజూ 70 ఎంజీడీలు, పరిశ్రమలకు 24 ఎంజీడీలు నీటిని తరలిస్తారు. ఇక ఏలేరు, రైవాడ, తాటిపూడి రిజర్వాయర్ల నుంచి వ్యవసాయానికి నీటిని విడుదల చేస్తుంటారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో ఉన్న నీటినే ఏడాది పొడవునా తాగు,సాగు, పరిశ్రమల అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి వరకూ పెద్దగా ఇబ్బంది లేకపోయినా, మార్చి నుంచి నీటి వినియోగం భారీగా పెరుగుతుంది. ఒక్కో ఏడాది వేసవిలో కొళాయిల ద్వారా నీటిని విడుదల చేసే సమయం గణనీయంగా తగ్గిపోతుంది. కొండవాలు, శివారు ప్రాంతాల్లో రెండు రోజులకొకసారి కొళాయిలు ఇచ్చే పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఈసారి మొంథా తుఫాన్‌ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురవడంతో రిజర్వాయర్లలో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల తాటిపూడి, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌లలో నీటి మట్టం బుధవారం నాటికి గరిష్ఠ స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ముడసర్లోవ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. ఏలేరు రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 86.56 మీటర్లు కాగా బుధవారం ఉదయానికి 85.38 మీటర్లకు చేరింది. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ఇక తాటిపూడి రిజర్వాయర్‌ గరిష్ఠ నీటిమట్టం 297 అడుగులు కాగా మంగళవారం నాటికి 294.8 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వరద నీరు భారీగా వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తినీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బుధవారం ఉదయానికి 294.4 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలతో వచ్చే ఏడాది వేసవిలో నీటి ఇబ్బందులు తప్పినట్టేనని అధికారులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - Oct 30 , 2025 | 01:05 AM