ప్రజాధనం వృథా
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:01 AM
గతంలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోల్లో లక్షలాది రూపాయల విలువచేసే సామగ్రి నిరుపయోగంగా పడివున్నాయి. వీటిల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆయా సామగ్రికి రక్షణ లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే....
ఇసుక డిపోల్లో నిరుపయోగంగా రూ.లక్షల విలువ చేసే సామగ్రి
గత ప్రభుత్వ హయాంలో ఆరుచోట్ల ఇసుక విక్రయ కేంద్రాలు
ప్రతి డిపోలో రేకుల షెడ్డు, తూనిక యంత్రం, సీసీ కెమెరాలు, కంప్యూటర్ ఏర్పాటు
ఏపీఎండీసీ నుంచి నిధులు వ్యయం
వినియోగించుకున్నది జేపీ వెంచర్స్
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మారిన ఇసుక పాలసీ
ప్రైవేటు సంస్థల ద్వారా అమ్మకం
నిరుపయోగంగా మారిన పాత ఇసుక డిపోలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
గతంలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోల్లో లక్షలాది రూపాయల విలువచేసే సామగ్రి నిరుపయోగంగా పడివున్నాయి. వీటిల్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ఆయా సామగ్రికి రక్షణ లేకుండా పోయింది. వివరాల్లోకి వెళితే....
గత వైసీపీ ప్రభుత్వం ఇసుక అమ్మకాల బాధ్యతను జేపీ వెంచర్స్ అనే ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. జిల్లాలో ఎక్కడా ఇసుక రీచ్‌లు లేకపోవడంతో పొరుగు జిల్లాల్లోని గోదావరి, నాగావళి, వంశధాన నదుల్లో నుంచి ఇసుకను తీసుకువచ్చి విక్రయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఇసుక డిపోలను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కు అప్పగించారు. సిబ్బంది వుండడానికి రేకుల షెడ్లు, విద్యుత్ సదుపాయం కోసం సోలార్ ప్యానళ్లు, డిపో పర్యవేక్షణకు సీసీ కెమెరాలు, కంప్యూటరు ఏర్పాటు చేశారు. ఇసుక తూకం వేయడానికి కాటా (వే బ్రిడ్జి) నిర్మించారు. ఇందుకు అయిన వ్యయం మొత్తాన్ని ఏపీఎండీసీ భరించింది. ఒక్కో డిపోలకు ఆయా సామగ్రి ఏర్పాటుకు సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది.
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తెచ్చింది. జేపీ వెంచర్స్‌కు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేసి నూతన ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఇసుక విక్రయాల్లో పారదర్శకత కోసం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇసుక తవ్వకాలు, రవాణా, విక్రయ బాధ్యతలను ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. అయితే వీరు గత వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఇసుల డిపోల్లో కాకుండా ఇతర ప్రదేశాల్లో డిపోలను ఏర్పాటు చేశారు. దీంతో అనకాపల్లి, నక్కపల్లి, నర్సీపట్నం, అచ్యుతాపురం, చోడవరం, లంకెలపాలెం ప్రాంతాల్లో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోలు నిరుపయోగంగా మారాయి. వీటిల్లో విలువైన సామగ్రి గురించి ఏపీఎండీసీ అధికారులు పట్టించుకోవడంలేదు. అనకాపల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి డిపోల్లో సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన కంటైనర్ బాక్సులు మాయం అయ్యాయి. తూనిక యంత్రాలు తప్పుపడుతున్నాయి. కాగా ఇసుక డిపోల్లో పరికరాలు వృథాగా పడివుండడంపై గనుల శాఖ ఏడీ శ్రీనివాసరావును వివరణ కోరగా.. వీటి గురించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేశామని, ఆదేశాలు వచ్చిన తరువాత తగు చర్యలు చేపడతామన్నారు.