మంత్రి నారా లోకేశ్‌కు ఘన స్వాగతం
ABN , Publish Date - Dec 05 , 2025 | 01:28 AM
పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం జరగనున్న మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌కు హాజరయ్యేందుకుగాను గురువారం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌కు విమానాశ్రయంలో ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.
గోపాలపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం జరగనున్న మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌కు హాజరయ్యేందుకుగాను గురువారం నగరానికి చేరుకున్న రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌కు విమానాశ్రయంలో ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, కోండ్రు మురళి, టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ, సీనియర్ నేతలు దాడి వీరభద్రరావు, దువ్వారపు రామారావు, బుద్దా నాగజగదీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, కోరాడ రాజబాబు, పీవీజీ కుమార్, మహ్మద్ నజీర్, లొడగల కృష్ణ, మళ్ల సురేంద్ర, పుచ్చా విజయకుమార్ తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు లాంజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత పలువురు సందర్శకులు లోకేశ్‌ను కలిసి ఫొటోలు దిగారు. మరికొందరు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గంలో పార్వతీపురం మన్యం జిల్లా భామిని బయలుదేరి వెళ్లారు.
నేడు మెగా పేరెంట్, టీచర్ మీటింగ్
తరగతుల వారీగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
సైన్స్, క్రీడా పరికరాల ప్రదర్శన
విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
ప్రస్తుత విద్యా సంవత్సరంలో రెండోసారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల (పీటీఎం) సమావేశం జిల్లాలోని 576 ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, పదికిపైగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ పర్యాయం ప్రైవేటు విద్యాసంస్థలను మినహాయించారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రతి పాఠశాలలో సమావేశం ప్రారంభం కానున్నది. 9.30 గంటల నుంచి 10.30 గంటల వరకు తరగతి వారీగా విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశమవుతారు. విద్యార్థుల చదువు, హాజరు తదితర వివరాలను తల్లిదండ్రులకు వివరించి ప్రోగ్రెస్ కార్డు అందజేస్తారు. ప్రతి విద్యార్థికి సంబంధించిన అసెస్‌మెంట్ బుక్స్‌తోపాటు జవాబుపత్రాలు అందజేసి వాటి గురించి తల్లిదండ్రులకు వివరించి సూచనలు చేస్తారు. ప్రతి తరగతి గదిలో ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, విద్యార్థులకు సంబంధించి కొత్త టెక్నాలజీ, బాలికల రక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్‌పై వీడియోలు ప్రదర్శిస్తారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్, సభ్యులు, దాతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. తొలుత ప్రధానోపాధ్యాయుడు పాఠశాల ప్రగతి నివేదిక సమర్పిస్తారు. విలువలతో కూడిన విద్యపై ఇద్దరు, ముగ్గురు విద్యార్థులతో నీతి కథలు, పద్యాలు చెప్పిస్తారు. అనంతరం తల్లిదండ్రులకు ఏమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ప్రతి పాఠశాలలో సైన్స్, క్రీడా పరికరాలలు, లైబ్రరీ పుస్తకాలు, విద్యార్థులు తయారుచేసిన చార్టులతో ఎగ్జిబిషన్ ఏర్పాటుచేస్తారు. అనంతరం మధ్యాహ్న భోజనం అందించడంతో కార్యక్రమం ముగుస్తుంది. పేరెంట్, టీచర్ సమావేశాల నిర్వహణపై అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఇప్పటికే తల్లిదండ్రులు, దాతలు, పాఠశాల పరిధిలో ప్రజాప్రతినిధులు, అభివృద్ధికమిటీల ప్రతినిధులకు సమాచారం అందించామన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు హాజరై పిల్లల పురోగతిని తెలుసుకోవాలని, అప్పుడే వారంతా మంచి పౌరులగా ఎదుగుతారని అన్నారు.
రుషికొండలో వర్చువల్ రియాల్టీ సెంటర్
త్రీ స్టార్ హోటల్ కూడా...
రూ.90 కోట్లతో పీపీపీ ప్రాజెక్టు
వీఎంఆర్‌డీఏ ఆమోదం
మూడేళ్లలో పూర్తికి ఉత్తర్వులు
విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి):
విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)లో రూ.90 కోట్ల వ్యయంతో కొత్త ప్రాజెక్టు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రుషికొండలో సంస్థకు చెందిన 2.82 ఎకరాల విస్తీర్ణంలో ‘వైజాగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ వర్చువల్ రియాల్టీ ఎరీనాతో పాటు 3 స్టార్ హోటల్ నిర్మించనున్నారు. ఇందులో 360 డిగ్రీల ఇమ్మెర్సివ్ థియేటర్, మిక్స్‌డ్ రియాల్టీ ఎస్కేప్ రూమ్, థీమాటిక్ షోలు, వర్చువల్ టైమ్-ట్రావెల్ అనుభవాలు, వర్చువల్ రియాల్టీ గేమింగ్ జోన్, అక్వేరియం వంటివి యువతను ఆకట్టుకునేలా ఏర్పాటుచేస్తారు. డైవ్-ఇన్-ఫుడ్ జోన్ ప్రత్యేకంగా ఉంటుంది. అందులో యాప్ ఎనేబుల్డ్ డైనింగ్, కేఫ్‌లు, ఫుడ్ కోర్టు, ఫైన్-డైనింగ్ వంటివి ఉంటాయి. వీటికి అదనంగా 3 స్టార్ సదుపాయాలతో బడ్జెట్ హోటల్ కూడా నిర్మిస్తారని చైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్‌లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ కూడా ఇచ్చినట్టు తెలిపారు. మూడేళ్లలో పూర్తి చేయాలనే గడువుతో ఈ ప్రాజెక్ట్టు చేపడుతున్నామని, ఇది విశాఖపట్నం ప్రజలకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.