బెర్రీ బోరర్ నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 10:45 PM
మండలంలోని చినలబుడు, పెదలబుడు పంచాయతీల పరిధిలో బెర్రీ బోరర్ కీటకం బారిన పడిన కాఫీ తోటలను పరిశీలించి కాఫీ కాయలను తొలగించి నివారణ చర్యలు యుద్ధప్రాతిపదిక చేపట్టామని ఐటీడీఏ కాఫీ ఏడీ లకే బొంజిబాబు తెలిపారు.
కాఫీ తోటల్లో 3,100 బ్రోకా ట్రాప్స్ పరికరాల ఏర్పాటు
158 ఎకరాల్లో పూర్తిగా కాఫీ కాయల తొలగింపు
రైతులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
ఐటీడీఏ కాఫీ ఏడీ లకే బొంజిబాబు
అరకులోయ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చినలబుడు, పెదలబుడు పంచాయతీల పరిధిలో బెర్రీ బోరర్ కీటకం బారిన పడిన కాఫీ తోటలను పరిశీలించి కాఫీ కాయలను తొలగించి నివారణ చర్యలు యుద్ధప్రాతిపదిక చేపట్టామని ఐటీడీఏ కాఫీ ఏడీ లకే బొంజిబాబు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెదలబుడు, చినలబుడు పంచాయతీల పరిధిలో 158.17 ఎకరాల కాఫీ తోటలకు బెర్రీ బోరర్ పురుగు సోకడంతో రెడ్‌జోన్‌గా గుర్తించి సంపూర్ణ నివారణ చర్యలు చేపట్టామన్నారు. 158 ఎకరాల్లో పూర్తిగా కాఫీ కాయలను తొలగించి వేడి నీళ్లలో ఉడకబెట్టి భూమిలో పాతిపెట్టే పనులు దాదాపు పూర్తి చేశామన్నారు. పురుగును ఆకర్షించి నాశనం చేసే 3,100 బ్రోకా ట్రాప్స్ పరికరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. మరో 9,000 పరికరాలు రావలసి ఉందన్నారు. బెర్రీ బోరర్‌పై కాఫీ రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాల నుంచి సుమారు 200 మంది పీజీ విద్యార్థులు, 30 మందికి పైగా శాస్త్రవేత్తలు, సీనియర్ ప్రొఫెసర్లు రెండు మండలాల్లో ఉన్న కాఫీ తోటల్లో జల్లెడ పట్టి నివారణకు తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. కలెక్టర్, ఐటీడీఏ పీవో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సిబ్బందికి తగిన సూచనలు ఇస్తున్నారని వారు చెప్పారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీహెచ్‌వో రాజశేఖర్ పాల్గొన్నారు.