Share News

బెర్రీ బోరర్‌ను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు

ABN , Publish Date - Oct 13 , 2025 | 11:12 PM

కాఫీ తోటల్లో ప్రమాదకారిగా మారిన బెర్రీ బోరర్‌ కీటకాన్ని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కాఫీ, ఉద్యానవన, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

బెర్రీ బోరర్‌ను అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

పాడేరు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కాఫీ తోటల్లో ప్రమాదకారిగా మారిన బెర్రీ బోరర్‌ కీటకాన్ని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ ఆదేశించారు. కాఫీ, ఉద్యానవన, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెడ్‌ జోన్‌, కంటామినెంట్‌ జోన్‌, బఫర్‌ జోన్‌ వంటి మూడు దశల్లో ఉండే బెర్రీ బోరర్‌ను ఏదో ఒక దశలో అరికట్టకుంటే, మొత్తం కాఫీ తోటలు నాశనమయ్యే ప్రమాదముందన్నారు. అలాగే బెర్రీ బోరర్‌ సమస్య ఉన్న ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు కాఫీ గింజలు, వాటిని నిల్వ చేసే సంచులు, టార్పాలిన్లను తరలించవద్దన్నారు. అటువంటి వాటి తరలింపుపై పూర్తిగా నిషేధం విధిస్తున్నామని ఆయన చెప్పారు. ఏదైనా కారణంతో ఈ నిబంధనలను అతిక్రమించే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. బెర్రీ బోరర్‌ వ్యాప్తికి కారకులైన వారిని ఉపేక్షించబోమన్నారు. ప్రస్తుతం కంటామినెంట్‌ జోన్‌లో ఉన్న కాఫీ రైతుల వివరాలను అధికారులు తక్షణమే తయారు చేయాలన్నారు.

కంటామినెంట్‌ జోన్‌లో మూడేళ్లు పరిరక్షణ చర్యలు

కాఫీ తోటల్లో బెర్రీ బోరర్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టామని, ప్రస్తుతం కంటామినెంట్‌ జోన్‌లో ఉన్న తోటల్లో మూడేళ్ల పాటు పరిరక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. అవసరమైన చర్యలను జాగ్రత్తగా చేపట్టి కాఫీ తోటలను రక్షించాలన్నారు. అలాగే తోటల్లో కింద పడిన కాఫీ గింజలను విధిగా శుభ్రం చేయాలని అధికారులకు సూచించారు. బెర్రీ బోరర్‌ను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని, రైతులకు దానిపై సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. నాణ్యమైన కాఫీ ఉత్పత్తి చేసేలా రైతులను సిద్ధం చేయాలని, రైతులందరూ మోటార్లతో పని చేసే పల్పింగ్‌ యంత్రాలను వినియోగించాలన్నారు. ఈ ఏడాది ఐటీడీఏ ద్వారా కాఫీ నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టడంతో పాటు నాణ్యత ఆధారంగా ధర నిర్ణయం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, కేంద్ర కాఫీ డిప్యూటీ డైరెక్టర్‌ హెచ్‌ఆర్‌ మురళీధర్‌, సీనియర్‌ లైజన్‌ అధికారి ఎల్‌.రమేశ్‌, ఐటీడీఏ కాఫీ విభాగం ఏడీ ఎల్‌.బొంజుబాబు, వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు, కాఫీ లైజన్‌ వర్కర్లు, రైతు ఉత్పత్తిదారు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2025 | 11:12 PM