Share News

వార్‌ వన్‌సైడ్‌

ABN , Publish Date - Dec 07 , 2025 | 01:20 AM

కలిసొచ్చిన పిచ్‌పై భారత్‌ బ్యాటర్లు కదంతొక్కారు. సౌతాఫ్రికాపై ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

వార్‌ వన్‌సైడ్‌

కలిసొచ్చిన పిచ్‌పై కదం తొక్కిన టీమిండియా

దక్షిణాఫ్రికాపై ఘన విజయం

సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్‌

అర్ధ సెంచరీలు చేసిన విరాట్‌, రోహిత్‌

ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో మార్మోగిన స్టేడియం

సౌతాఫ్రికా ప్లేయర్‌ డీ కాక్‌ సెంచరీ వృథా

నాలుగేసి వికెట్లు తీసిన ప్రసిద్ధ్‌ కృష్ణ, కులదీప్‌ యాదవ్‌

విశాఖపట్నం స్పోర్ట్స్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి):

కలిసొచ్చిన పిచ్‌పై భారత్‌ బ్యాటర్లు కదంతొక్కారు. సౌతాఫ్రికాపై ఆద్యంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో భారీ స్కోర్లు నమోదైనా, విజయం దోబూచులాడగా, పీఎం పాలెంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన కీలక మ్యాచ్‌లో భారత్‌ హవా కొనసాగింది. దీంతో తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది.

టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. మ్యాచ్‌ ప్రారంభం నుంచి భారత్‌ బౌలర్లు రాణించడంతో దక్షిణాఫిక్రా పూర్తి ఓవర్లు ఆడకుండానే 270 పరుగులకు ఆలౌట్‌ అయింది. సౌతాఫ్రికా ఓపెనర్‌ డీ కాక్‌ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగి సెంచరీ (106) సాధించగా, కెప్టెన్‌ బవుమా (48) భారత్‌ బౌలర్లను కొంతవరకు ఎదుర్కొన్నాడు. ప్రసిద్ధ కృష్ణ, కులదీప్‌ యాదవ్‌ అద్భుత బౌలింగ్‌తో చెరో నాలుగు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 39.5 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

భారత్‌ బ్యాటింగ్‌ విధ్వంసం

ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌ ఆటగాళ్ల బ్యాటింగ్‌ విధ్వంసం ప్రేక్షకులకు అసలైన క్రికెట్‌ మజాను అందించింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీకి ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ తోడై విధ్వంసకర బ్యాటింగ్‌తో అజేయ సెంచరీ సాధించాడు. జైస్వాల్‌ సెంచరీతో కదంతొక్కడంతో ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో స్టేండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చారు. ఇక మూడో మ్యాచ్‌లోనూ రోహిత్‌ శర్మ అర్ధసెంచరీ సాధించాడు. 25 ఓవర్ల వరకు ఓపెనర్ల దూకుడు కొనసాగింది. 54 బంతుల్లో ఆరు బౌండరీలు, సిక్సర్‌తో రోహిత్‌ తన కెరీర్‌లో 61వ అర్ధ సెంచరీ పూర్తిచేయగా...మరో ఎండ్‌లో యశస్వి జైశ్వాల్‌ 75 బంతుల్లో మూడు బౌండరీలు, సిక్సర్‌తో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. జోరుమీదున్న రోహిత్‌శర్మ వ్యక్తిగత 75 పరుగులవద్ద తొలి వికెట్‌గా వెనుతిరగడంతో బ్యాటింగ్‌కు దిగిన విరాట్‌ కోహ్లీ తొలి బంతి నుంచీ స్కోరు బోర్డు పరుగులెత్తించాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్‌ 111 బంతుల్లో పది ఫోర్లు, సిక్సర్‌తో వన్డే కెరీర్‌లో ఏదో సెంచరీ పూర్తిచేశాడు. విరాట్‌ 40 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లతో 53వ హాఫ్‌ సెంచరీ పూర్తిచేశాడు. నిగిడి వేసిన 40 ఓవర్‌లో విరాట్‌ కోహ్లీ బౌండరీ బాది మ్యాచ్‌ను విజయవంతంగా ముగించాడు.

కనువిందు చేసిన విరాట్‌, రోహిత్‌

ప్రేక్షకుల కల నెరవేరింది. అభిమాన క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మల బ్యాటింగ్‌ చూసేందుకు అష్టకష్టాలు పడి టికెట్లు సాధించుకున్న వారి ఆశ తీరింది. వీరిద్దరూ తమదైన శైలి బ్యాటింగ్‌తో ప్రేక్షకులకు కనువిందు చేశారు. సిక్సర్లు, బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తించారు. విరాట్‌, రోహిత్‌, జైస్వాల్‌ బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా బౌలర్లకు చూపిస్తుంటే ప్రేక్షకులు కేరింతలతో స్టేడియంను హోరెత్తించారు. వీరు ముగ్గురూ బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపూ స్టేడియంలోని ప్రేక్షకులంతా కుర్చీల్లోంచి లేచి నిలబడి మరీ తిలకించడం విశేషం.

Updated Date - Dec 07 , 2025 | 01:20 AM