Share News

వేతనాల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:21 AM

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా గత నెలలో బదిలీ అయిన ఐదు వేల మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 1,500 మందికి జూన్‌ నెల జీతాలు ఇంతవరకూ అందలేదు. కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్‌ ప్రాథమిక పాఠశాలలు, యూపీ నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జీతాలు రాలేదు.

వేతనాల కోసం ఎదురుచూపులు

మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు ఇంతవరకూ అందని జీతాలు

అప్‌గ్రేడ్‌ అయిన యూపీ పాఠశాలల్లో నియమితులైన గ్రేడ్‌-2 హెచ్‌ఎంలకు కూడా...

పోస్టుల కేటాయింపుపై గందరగోళం

విద్య, ట్రెజరీ శాఖల మధ్య సమన్వయలోపం

వచ్చే నెల కూడా కష్టమే...

విశాఖపట్నం, జూలై 16 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా గత నెలలో బదిలీ అయిన ఐదు వేల మంది ఉపాధ్యాయుల్లో దాదాపు 1,500 మందికి జూన్‌ నెల జీతాలు ఇంతవరకూ అందలేదు. కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్‌ ప్రాథమిక పాఠశాలలు, యూపీ నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేసిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు జీతాలు రాలేదు.

నూతన సంస్కరణల అమలులో భాగంగా ఉమ్మడి జిల్లాలో 538 మోడల్‌ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటుచేశారు. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్‌ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలను నియమించారు. అయితే కొత్తగా ఏర్పాటుచేసిన మోడల్‌ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలకు జీతాలు రావాలంటే సదరు పోస్టులు మంజూరుకావాలి. దీనికి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలి. ఆ తరువాత ఖజానా శాఖ పొజిషన్‌ ఐడీలు కేటాయించాలి. ఈ ప్రక్రియ ఇంతవరకూ పూర్తికాలేదు. మోడల్‌ ప్రాథమిక పాఠశాలల్లో హెచ్‌ఎంతోపాటు మరో నలుగురు టీచర్లను నియమించారు. ఈ పోస్టులను కూడా ప్రభుత్వం గుర్తించి ఆమోదించాలి. అప్పుడే జీతాల చెల్లింపునకు అనుమతి వస్తుంది.

అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో 34 యూపీ పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్‌ చేయడంతో గ్రేడ్‌-2 హెచ్‌ఎంలను అక్కడ నియమించారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు అంటే అప్పటివరకూ ఉన్నత పాఠశాలల్లో పనిచేసిన గజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు. కొత్తగా అప్‌గ్రేడ్‌ అయిన పాఠశాలల హెచ్‌ఎం పోస్టులను కూడా ప్రభుత్వం మంజూరుచేయాలి. లేదంటే పదోన్నతి ద్వారా స్కూలు అసిస్టెంట్‌లను నియమించాలి. అప్పుడే హెచ్‌ఎంలకు జీతాలు వచ్చేందుకు అవకాశం వస్తుంది. 34 యూపీ పాఠశాలల హెచ్‌ఎం పోస్టులు స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌లో ఉన్నాయి తప్ప గెజిటెడ్‌ హెచ్‌ఎం పోస్టులు కాదు. వీరికి జీతాలు రావాలంటే పాఠశాల విద్యా శాఖ ప్రత్యేకించి పోస్టులు కేటాయించి, ఆ విషయాన్ని ఖజానా శాఖకు పంపాలి. కాగా ఈ ఏడాది జిల్లాలో మోడల్‌ ప్రాథమిక పాఠశాలలతోపాటు విద్యార్థులు పెరిగిన పాఠశాలల్లో టీచర్లను నియమించారు. గత నెలలో జరిగిన బదిలీల్లో ఈ ప్రక్రియ చేపట్టారు. విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలల నుంచి ఎక్కువగా ఉన్న చోటకు పోస్టు బదిలాయింపు చేయాలి. దీనికి అనుగుణంగా కొత్తగా పాఠశాలలో నియమితులైన టీచర్‌కు పొజిషన్‌ ఐడీ కేటాయించాలి.

అయితే ఈ విషయంలో విద్యా శాఖ ముందుగా అప్రమత్తం కాలేదని టీచర్లు వాపోతున్నారు. ప్రధానంగా మండల విద్యాశాఖాధికారులు చొరవ తీసుకుని బదిలీపై వచ్చిన టీచర్లను రెండు కేటగిరీలుగా విభజించలేదని తప్పుబడుతున్నారు. రెగ్యులర్‌ పోస్టులోకి వచ్చిన టీచర్‌కు జీతం బిల్లు పెట్టేందుకు ఇబ్బంది లేదు. కొత్తగా కేటాయించిన పోస్టుల్లోకి వచ్చిన వారికి మాత్రమే జీతం కోసం పొజిషన్‌ ఐడీ రావాల్సి ఉంటుంది. దీనిని కొన్ని మండలాల విద్యాశాఖాధికారులు పరిగణనలోకి తీసుకోకపోవడంతో జూన్‌ నెల జీతం బిల్లు పెట్టలేకపోయారు. ఒక నెల జీతం నిలిచిపోతే తరువాత నెల రెగ్యులర్‌ జీతాల బిల్లులతో పెట్టేందుకు వీలులేదు. ఆగస్టు నెల తొలి వారంలో సప్లమెంటరీ బిల్లుల అప్‌లోడ్‌ సమయంలోనే తిరిగి బిల్లు పెట్టాలి. అంటే అందరికీ పొజిషన్‌ ఐడీలు వచ్చి ఆగస్టు తొలి వారంలో సప్లిమెంటరీ బిల్లుగా అప్‌లోడ్‌ చేస్తే సెప్టెంబరు ఒకటో తేదీన జూన్‌, జూలై నెల జీతాలు వస్తాయని టీచర్లు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యా శాఖ, ఖజానా శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో జీతాలు సకాలంలో అందుకోలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.

Updated Date - Jul 17 , 2025 | 01:21 AM