ప్రారంభోత్సవాలకు నిరీక్షణ
ABN , Publish Date - Oct 15 , 2025 | 01:07 AM
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెండు మండలాల్లో మూడుచోట్ల నిర్మించిన పోలీసు స్టేషన్ల నూతన భవనాలు ప్రారంభోత్సవాల కోసం ఎదురు చూస్తున్నాయి. నాతవరం, గొలుగొండల్లో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తికాగా, కృష్ణాదేవిపేట పోలీసు స్టేషన్ భవనం పది నెలల క్రితం పూర్తయ్యింది. గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు 2018లో ఈ పోలీసు స్టేషన్లకు కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతోపాటు శంకుస్థాపనలు కూడా జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లకుపైగా పనులు ఆగిపోయాయి. అనంతరం పనులు చేపట్టినప్పటికీ నత్తనడకన సాగాయి.
మూడుచోట్ల అందుబాటులోకి రాని పోలీసు స్టేషన్ల నూతన భవనాలు
ఏడేళ్ల క్రితం టీడీపీ హయాంలో రూ.7.5 కోట్లు మంజూరు
పనులు సైతం ప్రారంభం
వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిలుపుదల
రెండేళ్ల తరువాత పనులు పునరుద్ధరణ
నాతవరం, గొలుగొండల్లో రెండేళ్ల క్రితం, కృష్ణాదేవిపేటలో పది నెలల క్రితం పూర్తి
ప్రారంభోత్సవాలకు ముహూర్తం ఖరారు చేసిన అధికారులు
అనివార్య కారణాలతో రెండుసార్లు వాయిదా
శిథిలమైన భవనాల్లో ఇబ్బంది పడుతున్న పోలీసు సిబ్బంది
నూతన భవనాలను వెంటనే అందుబాటులోకి తేవాలని వినతి
నాతవరం/ కృష్ణాదేవిపేట, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):
నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెండు మండలాల్లో మూడుచోట్ల నిర్మించిన పోలీసు స్టేషన్ల నూతన భవనాలు ప్రారంభోత్సవాల కోసం ఎదురు చూస్తున్నాయి. నాతవరం, గొలుగొండల్లో రెండేళ్ల క్రితం నిర్మాణ పనులు పూర్తికాగా, కృష్ణాదేవిపేట పోలీసు స్టేషన్ భవనం పది నెలల క్రితం పూర్తయ్యింది. గతంలో టీడీపీ అధికారంలో వున్నప్పుడు 2018లో ఈ పోలీసు స్టేషన్లకు కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతోపాటు శంకుస్థాపనలు కూడా జరిగాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండేళ్లకుపైగా పనులు ఆగిపోయాయి. అనంతరం పనులు చేపట్టినప్పటికీ నత్తనడకన సాగాయి. నాతవరం, గొలుగొండ స్టేషన్ల భవనాలు సుమారు రెండేళ్ల క్రితం పూర్తయ్యాయి. కృష్ణాదేవిపేట భవనం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తయ్యింది. రెండు నెలల క్రితం పోలీసు స్టేషన్ల నూతన భవనాలను ప్రారంభించడానికి అధికారులు ముహూర్తం ఖరారు చేశారు. కానీ కారణం ఏమిటో తెలియదుగానీ ఈ కార్యక్రమం వాయిదా పడింది. మళ్లీ ఈ నెల 4వ తేదీన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత చేతుల మీదుగా భవనాలను ప్రారంభిస్తామని అధికారులు మరోసారి ప్రకటించారు. మంత్రి పర్యటన రద్దు కావడంతో ఈసారి కూడా ప్రారంభోత్సవం చేయలేదు.
నాతవరంలో..
నాతవరంలో సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించిన పోలీసు స్టేషన్ భవనం చిన్నది కావడం, పెరుగుతున్న అవసరాలకు చాలకపోవడంతో నూతన భవనం నిర్మించాలని సుమారు ఏడేళ్ల క్రితం అధికారులు భావించారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వెంటనే నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. కొద్ది నెలలకే ఎన్నికలు జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. పాలకుల ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. సుమారు రెండేళ్ల వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. తరువాత ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పనులను పునరుద్ధరించారు. సుమారు రెండేళ్ల క్రితం భవన నిర్మాణం పూర్తయ్యింది. కానీ అప్పటి పాలకులు ప్రారంభించలేదు. ఎన్నికల తరువాత కూటమి అధికారంలోకి వచ్చింది. సుమారు ఏడాదిపాటు దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఎట్టలకేలకు ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. కానీ వాయిదా వేశారు. మళ్లీ అక్టోబరు 4వ తేదీన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, హోం మంత్రి అనిత చేతుల మీదుగా పోలీసు స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. కూటమి నాయకులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్‌లు ఏర్పాటు చేశారు కానీ హోం మంత్రి అనిత పర్యటన రద్దు అయినట్టు ముందు రోజు పోలీసు అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో మరోసారి వాయిదా వేశారు.
గొలుగొండ, కృష్ణాదేవిపేటల్లో..
గొలుగొండ మండలంలో గొలుగొండ, కృష్ణాదేవిపేట పోలీసు స్టేషన్లకు నూతన భవనాల నిర్మాణానికి 2018లో శంకుస్థాపన జరిగింది. ఒక్కో భవనానికి రూ.2.5 కోట్ల చొప్పున అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. నాతవరం మాదిరిగానే ఇక్కడ కూడా వైసీపీ హయాంలో చాలా కాలంపాటు పనులు జరగలేదు. చివరకు గొలుగొండ పోలీసు స్టేషన్ భవనాన్ని రెండేళ్ల క్రితం, కృష్ణాదేవిపేట భవనాన్ని పది నెలల క్రితం పూర్తిచేశారు. వీటి ప్రారంభోత్సవానికి రెండుసార్లు ముహూర్తం పెట్టారు. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. గొలుగొండలో ప్రస్తుతం పోలీసు స్టేషన్ నిర్వహిస్తున్న భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. విధులు నిర్వహించడానికి పోలీసులు అధికారులు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. కృష్ణాదేవిపేట పోలీసు స్టేషన్ భవనం పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే తరహాలో వుంది. హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు, పోలీసు ఉన్నతాధికారులు స్పందించి నాతవరం, గొలుగొండ, కృష్ణాదేవిపేటల్లో నిర్మించిన పోలీసు స్టేషన్ల నూతన భవనాలను ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలని పోలీసు సిబ్బంది, స్థానికులు కోరుతున్నారు.