సబ్సిడీ రుణాలకు నిరీక్షణ
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:29 AM
బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు పొందాలనుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. గడిచిన నెల రోజుల నుంచి ఈ రుణాలకు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయింది.
బీసీ, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ
అకస్మాత్తుగా నిలిచిపోయిన ప్రక్రియ..ఆశావహుల్లో ఆందోళన
ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు యూనిట్ల పెంపు యోచన
ఈ క్రమంలోనే జాప్యం?
విశాఖపట్నం, జూన్ 17 (ఆంధ్రజ్యోతి):
బీసీ, ఎస్సీ కార్పొరేషన్‌ల ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలు పొందాలనుకున్న వారికి నిరీక్షణ తప్పడం లేదు. గడిచిన నెల రోజుల నుంచి ఈ రుణాలకు సంబంధించిన ప్రక్రియ నిలిచిపోయింది. మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియక దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సబ్సిడీతో కూడిన రుణాలు అందించే ప్రక్రియను పూర్తిగా పక్కనపెట్టేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మళ్లీ రుణాలను అందించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు అనుగుణంగా ఎస్సీ, బీసీ కార్పొరేషన్లకు భారీగా నిధులను మంజూరుచేసింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరించారు. రెండు నెలల కిందట దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. బీసీ, ఈబీసీ, రెడ్డి, ఆర్య వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్లకు కేటాయించిన 2,368 యూనిట్లకు 18,984 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆయా యూనిట్లకు 50 శాతం సబ్సిడీ, మరో 50 శాతం బ్యాంకు రుణంగా అందిస్తుండడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. అలాగే, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో కూడిన రుణాలను అందించేందుకు దరఖాస్తులను స్వీకరించారు. జిల్లాకు 406 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందుకోసం రూ.16.88 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో రూ.6.68 కోట్లు సబ్సిడీగా, రూ.9.35 కోట్లు బ్యాంకు రుణంగా ఇవ్వనుండగా, లబ్ధిదారులు వాటాగా రూ.0.84 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కనిష్ఠంగా లక్ష రూపాయలు నుంచి గరిష్ఠంగా నాలుగు లక్షల రూపాయల వరకూ సబ్సిడీ లభిస్తుంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలకు సుమారు తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే, అంతా రుణాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే బీసీ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ రెండు నెలల నుంచి, ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రక్రియ నెల రోజులుగా నిలిచిపోయింది. దీంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన నెలకొంది. గడిచిన ఐదేళ్ల నుంచి రుణాలు అందించనందున, యూనిట్ల సంఖ్య పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరిన నేపథ్యంలో ప్రక్రియకు బ్రేక్ పడిందంటున్నారు. జిల్లాలకు యూనిట్లు పెంచడంతోపాటు మరిన్ని నిధులు అందించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి ప్రస్తుతం 32 కేటగిరీల్లో మాత్రమే రుణాలు అందించేలా ప్రక్రియను చేపట్టారు. ఈ కేటగిరీలను మరింత పెంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు చెబుతున్నారు. ఇందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని, దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.