కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు
ABN , Publish Date - Jul 27 , 2025 | 12:58 AM
కొత్తగా సామాజిక పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు ఇబ్బంది పడుతున్నారని దేవరాపల్లి, గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు కర్రి సత్యం, గిరిబాబు తెలిపారు. శనివారం జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ దేవరాపల్లి జడ్పీ స్కూల్‌లో హిందీ,
అర్హులకు వెంటనే మంజూరు చేయాలి
- ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రుణాలు ఇవ్వాలి
- 108 వాహనాలు పనిచేయక ఇబ్బందులు
- అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో గైనకాలజీ సేవలు అంతంతమాత్రమే
- జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో సభ్యుల ఆందోళన
విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కొత్తగా సామాజిక పింఛన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు ఇబ్బంది పడుతున్నారని దేవరాపల్లి, గొలుగొండ జడ్పీటీసీ సభ్యులు కర్రి సత్యం, గిరిబాబు తెలిపారు. శనివారం జడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ దేవరాపల్లి జడ్పీ స్కూల్‌లో హిందీ, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో అర్హులకు రుణాలు మంజూరుచేయాలన్నారు. 108 వాహనాలు సరిగ్గా పనిచేయకపోవడంతో అత్యవసర రోగులకు సేవలు అందక ఇబ్బందిపడుతున్నారని కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ ఆరోపించారు. దీనిపై 108 కో-ఆర్డినేటర్ సురేశ్ బదులిస్తూ అత్యవసర రోగులు కాకుండా చిన్నపాటి సుస్తీచేసినా వాహనం కోసం ఫోన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో అత్యవసర రోగులు ఇబ్బంది పడుతున్నారని వివరణ ఇచ్చారు. అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో గైనకాలజీ విభాగంలో వైద్యులు కొందరి పనితీరు బాగాలేదని అనకాపల్లి జడ్పీటీసీ సభ్యురాలు సత్యవతి తెలిపారు. మాకవరపాలెం జడ్పీటీ సభ్యురాలు మాట్లాడుతూ తాళ్లపాలెం నుంచి మాకవరపాలెం వరకు రోడ్డు విస్తరణలో తొలగించిన చెట్లను కొందరు అటవీశాఖ అనుమతి లేకుండా విక్రయించారని ఆరోపించారు. అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసిన కూలీలకు మే నెల నుంచి వేతనాలు అందడం లేదని ఫిర్యాదుచేయగా, దానిపై వివరణ ఇచ్చేందుకు అల్లూరి జిల్లా డ్వామా విభాగం అధికారులు రాకపోవడంపై చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాయడం, చదవడం రావడం లేదని అనంతగిరి, అరకు జడ్పీటీసీ సభ్యులు డి.గంగరాజు, శెట్టి రోష్ని ఆందోళన వ్యక్తంచేశారు. సమావేశంలో జడ్పీ డిప్యూటీ సీఈవో కె. రాజ్‌కుమార్, పలు శాఖల అధికారులు, జడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.