Share News

ఇళ్ల బిల్లులకు నిరీక్షణ

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:58 AM

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న వందలాది మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఆరేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇంకా నాలుగున్నర కోట్ల రూపాయలకుపైగా బిల్లులు అందాల్సి వుంది.

ఇళ్ల బిల్లులకు నిరీక్షణ
గొలుగొండ మండలం జోగుంపేటలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకున్న ఇల్లు

‘పట్నం నియోజకవర్గంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం బకాయిలు రూ.4.69 కోట్లు

2014-19 మధ్య టీడీపీ హయాంలో 3,541 ఇళ్లు మంజూరు

ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షలు కేటాయించిన ప్రభుత్వం

చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తి, బిల్లుల చెల్లింపు

2019లో మారిన ప్రభుత్వం

మిగిలిన లబ్ధిదారులకు బిల్లులు ఇవ్వని వైసీపీ పాలకులు

కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సర్వే చేసిన ప్రభుత్వం

రూ.4.69 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు నిర్ధారణ

నిధులు త్వరగా విడుదల చేయాలని లబ్ధిదారుల వినతి

నర్సీపట్నం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్లు నిర్మించుకున్న వందలాది మంది లబ్ధిదారులు బిల్లుల కోసం ఆరేళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో వున్నప్పుడు నర్సీపట్నం నియోజకవర్గంలో ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇంకా నాలుగున్నర కోట్ల రూపాయలకుపైగా బిల్లులు అందాల్సి వుంది.

సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని నిరుపేదలకు గత టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య కాలంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.5 లక్షల చొప్పున మంజూరు చేసింది. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోపాటు అదనంగా కొంత సొమ్ము ఖర్చు చేసి లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నారు. నర్సీపట్నం నియోజకవర్గానికి మొత్తం 3,541 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో నర్సీపట్నానికి 612, గొలుగొండకు 935, మాకవరపాలేనికి 722, నాతవరం మండలానికి 1,272 ఇళ్లు కేటాయించారు. వీటిల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయి, లబ్ధిదారులకు బిల్లులు కూడా అందాయి. అయితే వివిధ కారణాల వల్ల కొంతమంది ఇళ్ల నిర్మాణ పనులను ఆలస్యంగాచెపట్టారు. వీరికి బిల్లులు కావాల్సిన సమయంలో (2019) వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీ హయాంలో నిర్మించిన ఇళ్లు కావడంతో రాజకీయ దురుద్దేశంతో హౌసింగ్‌ బిల్లులు చెల్లించలేదు. ఐదేళ్లపాటు పలువురు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన ఇళ్ల బిల్లుల బకాయిల విషయం తెరపైకి వచ్చింది. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో సర్వే చేసిన అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీని ప్రకారం నర్సీపట్నంలో రూ.56.84 లక్షలు, గొలుగొండ మండలంలో రూ.1.48 కోట్లు, మాకవరపాలెం మండలంలో 1.28 కోట్లు, నాతవరం మండలంలో రూ.1.35 కోట్లు చొప్పున మొత్తం రూ.4.69 కోట్లు లబ్ధిదారులుకు అందాల్సి వుంది.

Updated Date - Sep 24 , 2025 | 12:58 AM