Share News

నిధుల కోసం ఎదురుచూపులు

ABN , Publish Date - Oct 13 , 2025 | 12:48 AM

భూముల క్రయ విక్రయాల కోసం వసూలుచేసే స్టాంప్‌ డ్యూటీ నుంచి స్థానిక సంస్థలకు అందాల్సిన 25 శాతం నిధులకు గ్రామ పంచాయతీలు సుమారు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాయి.

నిధుల కోసం ఎదురుచూపులు

  • రిజిస్ట్రేషన్ల ఆదాయానికి పంచాయతీల ఆరాటం

  • జిల్లాకు రూ.10 కోట్ల మేర బకాయిలు

  • అభివృద్ధి పనులకు అవరోధం

విశాఖపట్నం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి):

భూముల క్రయ విక్రయాల కోసం వసూలుచేసే స్టాంప్‌ డ్యూటీ నుంచి స్థానిక సంస్థలకు అందాల్సిన 25 శాతం నిధులకు గ్రామ పంచాయతీలు సుమారు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు సొమ్ములు విడుదలచేసిన ప్రభుత్వం మరికొన్ని జిల్లాలకు ఇవ్వలేదు. ఈ జాబితాలో విశాఖ ఉంది.

జిల్లాలో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నగరానికి ఆనుకుని ఆనందపురం, భీమిలి, పెందుర్తి మండలాలు ఉండడంతో భూముల రిజిస్ట్రేషన్‌ విలువ ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు రాజాపులోవ నుంచి పినగాడి వరకు జాతీయ రహదారి పొడవునా ఉన్న గ్రామాల్లో భూముల క్రయవిక్రయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దీంతో ఆయా పంచాయతీల పరిధిలో భూములు క్రయవిక్రయాల సందర్భంగా చెల్లించే స్టాంపుడ్యూటీలో నాలుగుశాతం గ్రామ పంచాయతీలకు చెల్లించాలి. ఈ సొమ్ములు జనరల్‌ ఫండ్‌కు జమచేస్తారు. ఆ నిధులతో పంచాయతీల్లో పలు రకాల అభివృద్ధి పనులు చేపడతారు.

గత ప్రభుత్వ నిర్వాకం

వైసీపీ ప్రభుత్వ హయాంలో తొలి రెండేళ్లు ఎప్పటికప్పుడు స్టాంపుడ్యూటీ సొమ్ములు పంచాయతీలకు జమచేశారు. ఆ తరువాత సొమ్ములు ఇవ్వడంలో పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 2022-23 చివరి నుంచి ఇప్పటివరకు కొన్ని పంచాయతీలకు, 2023-24 నుంచి మరికొన్ని పంచాయతీలకు స్టాంపుడ్యూటీ ద్వారా రావాల్సిన నిధులు విడుదలచేయలేదు. నగరానికి ఆనుకుని ఉన్న పంచాయతీల పరిధిలో భూముల క్రయవిక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల వీఎంఆర్‌డీఏ భూసమీకరణ ద్వారా అభివృద్ధిచేసిన లేఅవుట్‌లలో రైతులకు వచ్చిన ప్లాట్లను విక్రయించారు. అధికారుల అంచనా మేరకు సుమారు రూ. 10 కోట్ల మేర స్టాంపుడ్యూటీ వాటా పంచాయతీలకు రావాల్సి ఉంది.

పంచాయతీలకు గ్రేడ్లు

ఇటీవల గ్రామ పంచాయతీలకు గ్రేడ్లు ప్రకటించిన నేపథ్యంలో ఆదాయ వ్యయాలను అధికారులు నిర్ధారించారు. అంటే సాధారణ నిధులు, కేంద్రం విడుదలచేసే ఆర్థిక సంఘం నిధులు, ఇంటి పన్నులు, వాణిజ్య సముదాయాలు, సంతల ద్వారా వచ్చే ఆదాయంతోపాటు స్టాంపుడ్యూటీ బకాయిలను పరిగణనలోకి తీసుకున్నారు. ఆదాయ ఆర్జన మేరకు పంచాయతీలకు గ్రేడింగ్‌ ఇచ్చారు. జిల్లాలో ఎక్కువ పంచాయతీలకు గ్రేడ్‌ 1,2.. ఇలా పలు హోదాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ .10 కోట్ల వరకు స్టాంపుడ్యూటీ వాటా రావాల్సి ఉంటుందని సమాచారం. పంచాయతీల విస్తరణలో భాగంగా చాలా గ్రామాల్లో కొత్తగా కాలనీలు, నివాసాలు వస్తున్నాయి. దీంతో వసతులు ముఖ్యంగా రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, తాగునీటా సరఫరా, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, పారిశుధ్యం నిర్వహణ చేపడుతున్నారు. దీనికి నిధులు అవసరమని సర్పంచ్‌లు చెబుతున్నారు. ఆర్థిక సంఘం నిధులు సరిపోవడంలేదని స్టాంపుడ్యూటీ వాటా విడుదల చేయాలని గంభీరం సర్పంచ్‌ వానపల్లి లక్ష్మి కోరారు. గత ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు విడుదలచేస్తే మౌలిక వసతులు కల్పిస్తామంటున్నారు.

Updated Date - Oct 13 , 2025 | 12:48 AM