ఉక్కులో మరోసారి వీఆర్‌ఎస్!
ABN , Publish Date - Dec 25 , 2025 | 01:33 AM
స్టీల్ ప్లాంటు మరోసారి వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్)ను బుధవారం ప్రకటించింది. ప్లాంటులో ఉన్న మానవ వనరుల రేషనలైజేషన్, సమర్థ వినియోగం, వ్యయాలను నియంత్రించి ఉత్పత్తి పెంచుకోవాలనే ఆలోచనతో వీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్‌ఎస్ ప్రకటించినప్పుడు 1,146 మంది సంస్థ ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు.
ఏడాది వ్యవధిలో మూడోసారి...
570 మందిని బయటకు పంపేందుకు ప్రణాళిక
ఇప్పటికే రెండు విడతల్లో 1,633 మందికి వీఆర్‌ఎస్
నియామకాలు ఆపేసి...ఉద్యోగులను తీసేసి!
ఇదీ యాజమాన్యం తీరు
ఇలాగైతే పూర్తిస్థాయి ఉత్పత్తి ఎలా సాధ్యం
కార్మిక వర్గాల విస్మయం
విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు మరోసారి వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్)ను బుధవారం ప్రకటించింది. ప్లాంటులో ఉన్న మానవ వనరుల రేషనలైజేషన్, సమర్థ వినియోగం, వ్యయాలను నియంత్రించి ఉత్పత్తి పెంచుకోవాలనే ఆలోచనతో వీఆర్‌ఎస్‌ను అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటిసారి వీఆర్‌ఎస్ ప్రకటించినప్పుడు 1,146 మంది సంస్థ ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్లిపోయారు. జూన్ నెలలో రెండోసారి వీఆర్‌ఎస్ ప్రకటించినప్పుడు ఇంకో 487 మంది ముందుకొచ్చారు. మొదటి విడత వీఆర్‌ఎస్ తీసుకున్న అందరికీ ఫుల్ సెటిల్‌మెంట్ చేయగా, రెండోసారి వీఆర్‌ఎస్ తీసుకున్నవారికి 50 శాతమే ప్యాకేజీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, మిగిలిన మొత్తాలు తరువాత ఇస్తామని చెప్పి ఆరు నెలలైనా ఇప్పటివరకూ బకాయిలు ఇవ్వలేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ డబ్బులు కూడా చెల్లించలేదు. ఉద్యోగులు అందరికీ మూడున్నర నెలల జీతం బకాయి పెట్టారు. నెల నెలా జీతాలు అందనందున వీఆర్‌ఎస్ తీసుకుని, ఆ డబ్బుతో ఏదో ఒకటి చేసుకుందామని అనుకుంటే అవి కూడా పూర్తిగా ఇవ్వకుండా ప్రస్తుత యాజమాన్యం వేధిస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఇది చట్ట విరుద్ధమని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. చేతిలో డబ్బులు లేవంటున్న యాజమాన్యం వీఆర్‌ఎస్ ప్రకటన ఎలా ఇస్తుందని ప్రశ్నిస్తున్నాయి. ఈసారి మరో 570 మందికి వీఆర్‌ఎస్ ఇవ్వాలని ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం.
స్టీల్ ప్లాంటు యాజమాన్యం నిర్ణయాలు కార్మిక వర్గాలను తీవ్ర విస్మయానికి గురిచేస్తున్నాయి. కేంద్రం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందించిన సాయంతో ప్లాంటును లాభాల బాటలోకి తీసుకువస్తామని ప్రకటించిన యాజమాన్యం అందుకు విరుద్ధంగా చర్యలు చేపడుతోంది. గత నాలుగేళ్ల నుంచి నియామకాలు లేవు. పదోన్నతులు ఇవ్వడం లేదు. హెచ్‌ఆర్‌ఏ కోత పెట్టారు. మూడున్నర నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఇప్పుడు ఉత్పత్తి ఆధారిత జీతాలు అంటూ 20 శాతం తగ్గించి ఇస్తున్నారు. ఉద్యోగులు ప్లాంటు వదిలి వెళ్లిపోయే పరిస్థితులు తీసుకువచ్చారు.
ప్రతి నెలా సగటున 50 మంది పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది రెండు విడతలుగా వలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్ (వీఆర్‌ఎస్) ప్రకటించి సుమారు 1,500 మందిని ఇంటికి పంపించేశారు. ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఒకప్పుడు 14 వేలు ఉండే ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 9,385కి పడిపోయింది. ఎగ్జిక్యూటివ్‌లు 2,819 మంది, నాన్ ఎగ్జిక్యూటివ్‌లు 6,566 మంది కలిపి 9,385 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మరో 570 మందిని మూడో విడత వీఆర్‌ఎస్ ద్వారా తీసేయాలని ప్రణాళిక రూపొందించారు. అదేవిధంగా కాంట్రాక్టు వర్కర్లను ఐదు వేలకు తొలగించారు. మరో వైపు మూడు బ్లాస్ట్ ఫర్నేసుల ద్వారా 92 శాతం ఉత్పత్తి చేయాలని ఒత్తిడి పెడుతున్నారు. ఏ మాత్రం ఉత్పత్తి తగ్గినా ఉద్యోగులు పనిచేయడం లేదని ప్రచారం చేస్తున్నారు. యంత్రాల మరమ్మతులు, నిర్వహణ పనులు గాలికి వదిలేశారు. దానివల్ల ఏ ప్రమాదం జరిగినా దానికి ఉద్యోగులే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేసే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.
ఉత్పత్తి వ్యయం తగ్గింపు పేరుతో భారీ కొనుగోళ్లు
ఉత్పత్తి వ్యయం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతూ పెల్లెట్లను లక్షలాది టన్నులు బయట కొంటున్నారు. కోక్ కూడా నాణ్యమైనది రావడం లేదు. దాంతో ఉత్పత్తుల్లో నాణ్యత లోపిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉత్పత్తులకు మార్కెట్‌లో డిమాండ్ సృష్టించాల్సింది పోయి అందుకు విరుద్ధంగా డీగ్రేడ్ చేస్తున్నారు. నెలాఖరున పదవీ విరమణ చేస్తున్న సీఎండీ ఈలోగానే వీఆర్‌ఎస్ ప్రకటన ఇవ్వడం వెనుక కుట్ర దాగి ఉందని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని ఉద్యోగ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలపై కూడా విచారణ చేయాలని కోరుతున్నాయి. మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌ను అనువుగాని వర్షాకాలంలో పునఃప్రారంభం చేసి, ఎక్కువ ఉత్పత్తి పేరుతో రోజుకు ఐదు వేల టన్నుల పూల్ ఐరన్‌ని నేలపాల్జేస్తున్నారని, ఈ నిర్ణయాల వల్ల రూ.2 వేల కోట్ల నష్టం వచ్చిందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. నష్టాలు వచ్చే తప్పుడు నిర్ణయాలు యాజమాన్యాలు తీసుకొని, ఉద్యోగులపైకి నెడుతున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తునామని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. సెయిల్‌లో ఉత్పత్తి, ఉద్యోగుల సంఖ్య ఎలా ఉందో చూసి, దాని ప్రకారం విశాఖపట్నం స్టీల్ ప్లాంటులో ఉత్పత్తికి తగిన ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.