స్టీల్ ప్లాంటులో మరో 468 మందికి వీఆర్‌ఎస్
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:18 AM
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తగ్గించుకుంటూ పోతోంది.
యాజమాన్యం నిర్ణయం
ఇప్పటికే ఉద్యోగుల కొరత...12 గంటల డ్యూటీ చేయాల్సిన పరిస్థితులు
వందలాది మందిని తొలగిస్తే ఎలాగనే ప్రశ్నలు
మరో వైపు తగ్గిపోతున్న ఉత్పత్తి
పట్టించుకోని ప్రభుత్వాలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
స్టీల్ ప్లాంటు యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. ఉద్యోగులు, కాంట్రాక్టు వర్కర్లను తగ్గించుకుంటూ పోతోంది. తాజాగా రెండో విడత ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి శనివారం ఆమోదం తెలిపింది. వీఆర్‌ఎస్‌కు 1,150 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 997 మందిని అర్హులుగా గుర్తించారు. అందులో 468 మందికి వీఆర్‌ఎస్ ఇస్తున్నట్టు శనివారం ప్రకటించారు. ఆ జాబితాలో 69 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉండగా మిగిలిన 399 మంది నాన్ ఎగ్జిక్యూటివ్‌లు. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆయా ఉద్యోగుల మెయిళ్లకు వ్యక్తిగతంగా పంపించారు.
సుమారు పది వేల మంది వరకు ఉన్న ఉద్యోగుల సంఖ్యను 7,500కు తీసుకురావాలనే లక్ష్యంతో యాజమాన్యం దశల వారీగా చర్యలు చేపడుతోంది. వీఆర్‌ఎస్-1లో 1,140 మందిని ఇంటికి పంపించారు. ఇప్పుడు మరో 468 మంది సెప్టెంబరు నుంచి ఆగిపోతారు. వీరు కాకుండా నెలకు 60 నుంచి 80 మంది పదవీ విరమణ చేస్తున్నారు. దీంతో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. అటు చూస్తే మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఆపరేట్ చేస్తూ 100 శాతం ఉత్పత్తి తీయాలంటూ ఒత్తిడి పెడుతున్నారు. ఉద్యోగుల పని గంటలను పెంచారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ 12 గంటలు డ్యూటీ చేయిస్తున్నారు. సహాయంగా అందుబాటులో ఉండాల్సిన కాంట్రాక్టు వర్కర్లను తగ్గించేశారు. దాంతో ఏ విభాగంలోను పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదు. ఉత్పత్తి అనుకున్న స్థాయిలో రావడం లేదు. రోజుకు 21 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా శుక్రవారం (22వ తేదీన) మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు కలిపి 6,160 టన్నులు మాత్రమే హాట్ మెటల్ తీశారు. ఇది లక్ష్యంలో మూడో వంతు కూడా లేదు. ఇందులో ఉద్యోగుల తప్పిదం, అలసత్వం ఏమీ లేదు. కేవలం యాజమాన్యం తప్పుడు నిర్ణయాలు, సిబ్బందిని కుదించడం వల్లే ఇలా జరుగుతోంది. ఈ విషయాన్ని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ గుర్తించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్‌చార్జి సీఎండీ సక్సేనా చెప్పిన మాటలనే విశ్వసిస్తోంది. ఇది ఉక్కు ఉద్యోగులు-రాష్ట్ర ప్రభుత్వం మధ్య అంతరం పెంచుతోంది. ఉక్కు యాజమాన్యం నిర్ణయాలపై కూటమి నాయకులు కూడా సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ప్రైవేటీకరణ జరగదని మాత్రం చెబుతున్నారు. వాటిని ప్లాంటులో ఒక్కరు కూడా విశ్వసించడం లేదు.
లైమ్ స్టోన్ సరఫరాలో అడ్డంకులు
కన్వేయర్ల వద్ద తగినంత మంది సిబ్బంది లేకపోవడమే కారణం
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటులోని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంటు (ఆర్‌ఎంహెచ్‌పీ)లో కన్వేయర్ల పరిస్థితి రోజురోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. లైమ్ స్టోన్‌ను సరఫరా చేసే కన్వేయర్ వద్ద కాంట్రాక్టు కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక్కడ మొత్తం 41 మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేయాల్సి ఉండగా, కేవలం 14 మందిని మాత్రమే ఉన్నారు. అంటే తీవ్రమైన మానవ వనరుల కొరత ఏర్పడింది. అవసరమైనంత మంది ఉంటే స్పిల్ అయిన (కిందపడిన) మెటీరియల్‌ను వెంటవెంటనే క్లియర్ చేస్తారు. అంతమంది లేకపోవడంతో స్టీల్ మెల్ ్టషాప్(ఎస్‌ఎంఎస్)కు అందాల్సిన లైమ్ స్టోన్ సరఫరా 65 శాతం పడిపోయింది. స్టీల్ తయారీలో లైమ్ స్టోన్ చాలా కీలకం. స్టీల్‌లో మలినాలను తొలగించడం, నాణ్యతను మెరుగుపరచడంలో సహాయ పడుతుంది. అవసరమైన లైమ్ స్టోన్ ఆర్‌ఎహెచ్‌పీ నుంచి సరఫరా కాకపోవడంతో బ్లాస్ట్ ఫర్నేస్‌లో లిక్విడ్ స్టీల్ ఉత్పత్తి ప్రక్రియ మందగించింది. దీంతో స్టీల్ ఉత్పత్తి మరింత క్షీణించింది. కాంట్రాక్టు కార్మికుల తొలగింపులో యాజమాన్యం అనాలోచిత నిర్ణయాలతో ఈ సమస్య ఉత్పన్నమైందని ఉద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి.