విద్యాలయాల్లో సమస్యలపై గళం
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:43 AM
ప్రభుత్వ ఆధీనంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో వున్న విద్యా సంస్థల్లో సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు గళం విప్పారు. విద్యార్థుల రక్షణ కోసం ప్రహరీ గోడల నిర్మాణం, వసతిగృహాల్లో రక్షిత తాగునీటి సదుపాయం వంటి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరారు. ఇంకా గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి పలు అంశాలను సభ్యులు ప్రస్తావించారు.
- ప్రహరీ గోడలు లేకపోవడంతో ఇతరుల ప్రవేశం
- ఏజెన్సీ ఆశ్రమాలకు ఆరోగ్య కార్యకర్తలు అవసరం
- హాస్టళ్లలో శీతాకాలంలో గోరువెచ్చని తాగునీరు సరఫరా చేయాలి
- జడ్పీ స్థాయీ సంఘ సమావేశాల్లో గళమెత్తిన సభ్యులు
- గ్యాస్ సిలిండర్లకు ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదు
- గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖలపై చర్చ
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆధీనంలోని వివిధ యాజమాన్యాల పరిధిలో వున్న విద్యా సంస్థల్లో సమస్యలపై జడ్పీటీసీ సభ్యులు గళం విప్పారు. విద్యార్థుల రక్షణ కోసం ప్రహరీ గోడల నిర్మాణం, వసతిగృహాల్లో రక్షిత తాగునీటి సదుపాయం వంటి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాలని కోరారు. ఇంకా గృహ నిర్మాణం, పౌరసరఫరాలు, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి పలు అంశాలను సభ్యులు ప్రస్తావించారు.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన గురువారం ఇక్కడ ఒకటి, రెండు, నాలుగు, ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. నాలుగో స్థాయీ సంఘ సమావేశంలో విద్యా శాఖపై జరిగిన చర్చలో అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థుల రక్షణ కోసం ప్రహరీ గోడలు నిర్మించాలని కోరారు. చైర్‌పర్సన్‌తోపాటు అనంతగిరి, కె.కోటపాడు, గొలుగొండ, దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యులు డి.గంగరాజు, ఈర్లె అనురాధ, గిరిబాబు, కర్రి సత్యం మాట్లాడుతూ, పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడంతో ఇతరులు ప్రవేశించి, విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని అన్నారు. పాఠశాలలకు రక్షణ కల్పనలో భాగంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాలు స్పందించి పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించాలన్నారు. అనంతగిరి సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ, ఏజెన్సీలోని పలు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, అందువల్ల ప్రతి ఆశ్రమ పాఠశాలలో ఆరోగ్య కార్యకర్తలు/ఏఎన్‌ఎంలను నియమించాలని కోరారు. చైర్‌పర్సన్ మాట్లాడుతూ, శీతాకాలంలో ఆశ్రమాలు, వసతిగృహాల్లో విద్యార్థులు తాగడానికి గోరు వెచ్చని నీటిని సరఫరా చేయాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో వాటర్ ప్యూరిఫైయర్లను బాగుచేయించి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యా శాఖాధికారి బ్రహ్మాజీ బదులిస్తూ.. పాఠశాలల్లో మరుగుదొడ్లను పరిశుభ్రం చేయడానికి సిబ్బంది ఉన్నారని చెప్పారు. శిథిలావస్థకు చేరిన పాఠశాలల భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నర్సీపట్నం మండలం వేములపూడి బాలికల వసతిగృహ భవనం వర్షం పడితే శ్లాబ్ నుంచి నీరు కారుతున్నదని, తక్షణమే మరమ్మతులు చేయించాలని జడ్పీటీసీ సభ్యురాలు ఎస్.రమణమ్మ కోరారు.
గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.861 కాగా గ్రామీణ ప్రాంతంలో సిలిండర్ డెలివరీ బాయ్స్ రూ.920 వసూలు చేస్తున్నారని కోటవురట్ల జడ్పీటీసీ సభ్యురాలు సిద్దాబత్తుల ఉమాదేవి ఫిర్యాదు చేశారు. అనకాపల్లి జిల్లా సహాయ పౌరసరఫరాల అధికారి నందకిశోర్ స్పందిస్తూ, గ్యాస్ ఏజెన్సీ డీలర్లతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతగిరి సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ, ఈ-కేవైసీ చేయకపోవడంతో చాలామందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందడంలేదని అన్నారు. అల్లూరి జిల్లా పౌరసరఫరాల శాఖ ప్రతినిధి బదులిస్తూ.. గ్యాస్ గోదాములు, గ్యాస్ డీలర్ల వద్ద ఈ-కేవైసీ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.
చైర్‌పర్సన్ సుభద్ర మాట్లాడుతూ, అరకు, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిత్యావసర సరుకుల పంపిణీ బాధ్యతల నుంచి జీసీసీని తప్పించారా? అని ప్రశ్నించారు. సంబంధిత ప్రతినిధి బదులిస్తూ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్నామన్నారు. దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం మాట్లాడుతూ, పాడిపశువుల కొనుగోలుకు డీఆర్‌డీఏ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వడంలేదని అన్నారు. గొలుగొండ మండలం వెంకటరాంపురంలో సదరం సర్టిఫికెట్ల ప్రకారం సంక్షేమ పింఛన్లు తీసుకుంటున్న వారికి పలుమార్లు నోటీసులు ఇచ్చి మానసికంగా వేధిస్తున్నారని జడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు ఆరోపించారు. డీఆర్‌డీఏ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చైర్‌పర్సన్ ఆదేశించారు. హౌసింగ్‌పై అనంతగిరి సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ, చిలకలగెడ్డలో పేదలకు గతంలో ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చారని, కానీ ఇళ్ల నిర్మాణాలకు ఇంతవరకు అనుమతులు ఇవ్వలేదని అన్నారు. పలు పీహెచ్‌సీల అంబులెన్స్‌లకు డ్రైవర్ల కొరత ఉందని కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యుడు అనురాధ అన్నారు. తొలుత కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు మరణంపట్ల సమావేశంలో రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. సమావేశంలో జడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.