Share News

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బదిలీ

ABN , Publish Date - Oct 10 , 2025 | 01:26 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌కు విజయవాడ బదిలీ అయింది.

వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ బదిలీ

ఐ అండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌గా విశ్వనాథన్‌ నియామకం

కలెక్టర్‌కు వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు

విశాఖపట్నం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కమిషనర్‌ కేఎస్‌ విశ్వనాథన్‌కు విజయవాడ బదిలీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం పలువురు ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇందులో భాగంగా విశ్వనాథన్‌ను ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ శాఖ డైరెక్టర్‌గా నియమించింది. దీంతో పాటు సాధారణ పరిపాలన ఎక్స్‌ అఫీషియో డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలను కూడా అప్పగించింది. విశ్వనాథన్‌ మూడేళ్ల క్రితం జాయింట్‌ కలెక్టర్‌గా విశాఖపట్నంలో బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత జీవీఎంసీలో అదనపు కమిషనర్‌గా కొన్ని నెలలు పనిచేశారు. ఏడాదిన్నర క్రితం వీఎంఆర్‌డీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. పనిచేసిన ప్రతి చోటా తనదైన ముద్ర వేశారు.

నిజాయితీ గల అధికారిగా...

విశ్వనాథన్‌ నిజాయితీ గల అధికారిగా గుర్తింపు పొందారు. వీఎంఆర్‌డీఏలో ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. సిరిపురంలో ‘ది డెక్‌’ నిర్మాణం పూర్తిచేయడంతో పాటు దానిని ప్రముఖ సంస్థలకు అప్పగించడంలో కీలకంగా వ్యవహరించారు. కైలాసగిరిపై జిప్‌లైనర్‌, స్కై సైక్లింగ్‌తో పాటు గ్లాస్‌ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చారు. భోగాపురం విమానాశ్రయాన్ని కలుపుతూ మాస్టర్‌ ప్లాన్‌ రహదారుల నిర్మాణ పనులను పట్టాలెక్కించారు. ఇక జీవీఎంసీలో ఉండగా చెరువుల ఆక్రమణలపై దృష్టి సారించి, పాడైన చెరువుల పునరుద్ధరణకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టారు. సుమారు ఐదు చెరువులను పునర్నిర్మించి, వాటికి నిత్యం నీరందే ఏర్పాట్లు చేశారు. విశాఖ- భీమిలి మార్గంలో పలుచోట్ల తీర ప్రాంతం కోతకు గురవుతున్న నేపథ్యంలో పరిరక్షణకు కేంద్రం విశాఖ ఎంపీ సాయంతో ఇటీవల రూ.220 కోట్ల నిధులు సాధించారు. విశాఖలో మధ్య తరగతి ప్రజల కోసం ఎంఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి పనిని నిర్దిష్ట సమయంలో పూర్తిచేసేలా సిబ్బందిని సమన్వయపరిచారు.

శ్రీమతికి బదిలీతో...

విశ్వనాథన్‌ శ్రీమతి విశ్వాంజలి గైక్వాజ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారిణి. విశాఖపట్నం రీజియన్‌ పాస్‌పోర్టు అధికారిగా పనిచేసేవారు. రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆమెను తైవాన్‌కు అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పంపింది. మూడేళ్ల వరకు ఆమె అక్కడే ఉంటారు. ఈ నేపథ్యంలో విశ్వనాథన్‌ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సంప్రతించి తనను బదిలీ చేయాలని కోరారు. విశాఖ వచ్చి ఎక్కువ కాలమే అయినందున మరో శాఖలో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరడంతో ప్రభుత్వం అనుమతించి విజయవాడకు బదిలీ చేసింది.

9ఏజిపి2: బాధితురాలి నుంచి వివరాలు సేకరిస్తున్న సీఐ శ్రీనివాసరావు

అగనంపూడిలో దోపిడీ

వృద్ధిరాలిని కత్తితో బెదిరించి ఆరు తులాల బంగారం చోరీ

అగనంపూడి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి):

అగనంపూడి జాబిలిహిల్స్‌లో పట్టపగలే దోపిడీ జరిగింది. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని గుర్తుతెలియని దుండగుడు కత్తితో బెదిరించి ఆమె ఒంటిపై ఉన్న సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లాడు. బుధవారం సాయంత్రం ఈ సంఘటనకు సంబంధించి సౌత్‌ క్రైమ్‌ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలావున్నాయి.

జీవీఎంసీ 79వ వార్డు అగనంపూడి శివారు శనివాడ జాబిలిహిల్స్‌ రెండో లైన్‌లో గల రెండు అంతస్థుల ఇంట్లో ఇద్దరు కుమార్తెలతో కలిసి కె.అమ్మన్న (77) నివాసముంటోంది. బుధవారం మధ్యాహ్నం 3.50 గంటలకు కుటుంబసభ్యులంతా షాషింగ్‌ నిమిత్తం గాజవాక వెళ్లారు. మనవడు సుమంత్‌ కింద ఇంట్లో టీవీ చుస్తూ నిద్రపోయాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి పైఅంతస్థులో ఉన్న అమ్మన్న దగ్గరికి వెళ్లాడు. కత్తితో బెదించి ఆమె ఒంటిపై ఉన్న సుమారు ఆరు తులాల బంగారు చైను, గాజులు, ఉంగరం, చెవి దిద్దులు దోచుకుని వెళ్లిపోయాడు. తేరుకున్న అమ్మన్న కేకలు వేయడంతో మనవడు సుమంత్‌ పరుగున రెండో అంతస్థుకు చేరుకునే సరికి దుండగుడు ఉడాయించాడు. అమ్మన్న కుమార్తె శ్రావణి దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. స్థానికులే చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సీసీ టీవీ పుటేజీ పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


అడవివరంలో రైడెన్‌ డేటా సెంటర్‌

సింహాచలం దేవస్థానానికి చెందిన 100 ఎకరాలు గుర్తింపు

విశాఖపట్నం, అక్టోబరు (ఆంధ్రజ్యోతి):

సింహాచలం దేవస్థానానికి చెందిన అడవివరం కొండవాలు ప్రాంతంలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్పోటెక్‌ ఇండియా లిమిటెడ్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నది. ఇందుకోసం అడవివరంలో సెంట్రల్‌ జైలు, శ్రీకృష్ణాపురం గురుకులానికి ఆనుకుని దేవస్థానానికి చెందిన 100 ఎకరాలను గుర్తించారు. విశాఖకు రానున్న కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు అనుసంధానంగా గూగుల్‌ అనుబంధ సంస్థ నగరంలోని అడవివరం, ఆనందపురం మండలం తర్లువాడ, అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సెంటర్లు ఏర్పాటుచేస్తోంది. సముద్రానికి అతి చేరువలోనే భూమి కేటాయించాలని గూగుల్‌ సంస్థ కోరింది. ప్రభుత్వం ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీచేసింది. తర్లువాడలో భూముల సేకరణకు ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానానికి చెందిన కొండవద్ద 100 ఎకరాల్లో క్యాంపస్‌ ఏర్పాటుచేస్తారు. ఈ భూములు దేవస్థానానికి చెందినవి కావడంతో ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

Updated Date - Oct 10 , 2025 | 01:26 AM