Share News

వీఎంఆర్‌డీఏ బంపర్‌ ఆఫర్‌

ABN , Publish Date - Oct 01 , 2025 | 12:36 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తొలిసారిగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

వీఎంఆర్‌డీఏ బంపర్‌ ఆఫర్‌

కాపులుప్పాడ లేవుట్‌లో వేలం లేకుండా ప్లాట్లు

తొలి 20 మందికే అవకాశం

గజం అప్‌సెట్‌ ధర రూ.23,500కే

మిగిలిన ప్లాట్లకు వేలం

విశాఖపట్నం, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) తొలిసారిగా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. లేఅవుట్లలో ఖాళీ ప్లాట్లకు ఇటీవల కాలంలో వేలం నిర్వహిస్తున్న అధికారులు కొత్త లేఅవుట్లు కూడా వేస్తున్నారు. తాజాగా అదానీ డేటా సెంటర్‌కు సమీపాన కాపులుప్పాడలో 21.52 ఎకరాల్లో కొత్త లేఅవుట్‌ వేసింది. అందులో మొత్తం 105 ప్లాట్లు ఉండగా వాటిని వేలం ద్వారా విక్రయించడానికి ఏర్పాట్లు చేసింది. అప్‌సెట్‌ ధర గజం రూ.23,500గా నిర్ణయించింది. అంటే వేలంలో ఎంత ఎక్కువకు పాడుకుంటే వారికే ఆయా ప్లాట్లు విక్రయిస్తారు. ఇందులో ఆఫర్‌ ఏమిటంటే...ప్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న తొలి 20 మందికి ఎటువంటి వేలం లేకుండా కోరుకున్న సైజు ప్లాటు చ.గజం అప్‌సెట్‌ ధర అంటే రూ.23,500కే ఇస్తారు.

ఇవీ వివరాలు

కాపులుప్పాడ సర్వే నంబర్లు 68/1పి, 2పి, 98/2, 3లలో మొత్తం 21.52 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. అందులో ప్లాటెడ్‌ ఏరియా 12.885 ఎకరాలు. అందులో 105 ప్లాట్లు వచ్చాయి. లేఅవుట్‌లో రహదారులకు 5.585 ఎకరాలు, ఓపెన్‌ స్పేస్‌గా 2.16 ఎకరాలు విడిచిపెట్టారు. ఇవి కాకుండా మౌలిక వసతులకు కొంత స్థలం కేటాయించారు. మొత్తం 105 ప్ల్లాట్లలో వివిధ సైజులు ఉన్నాయి. 100/90 సైజులో 1,000 చ.గజాల ప్లాట్లు 35, 50/85 సైజులో 472.22 చ.గజాల ప్లాట్లు 29, 46/90 సైజులో 460 గజాల ప్లాట్లు 4, 50/80 సైజులో 444.44 గజాల ప్లాట్లు 11, 36/55 సైజులో 220 గజాల ప్లాట్లు 13, 36/50 సైజులో 200 గజాల ప్లాట్లు 13 ఉన్నాయి. వీటిలో దేనికైనా దరఖాస్తు చేసుకోవచ్చు. మొదట వచ్చిన దరఖాస్తుల్లో 20 మందికి వేలం లేకుండా అప్‌సెట్‌ ధరకే ఇస్తారు.

ఇది మంచి ఆఫర్‌

విశ్వనాథన్‌, కమిషనర్‌, వీఎంఆర్‌డీఏ

వీఎంఆర్‌డీఏ ఇప్పటివరకూ ఇలాంటి ఆఫర్లు ప్రకటించలేదు. కొనుగోలుదారుల్లో ఆసక్తి పెంచడానికి దీనిని ప్రవేశపెట్టాము. ఈ లేఅవుట్‌ డేటా సెంటర్లకు దగ్గరగా ఉండడం ప్రత్యేకత. ఐటీ రంగంలో ఉన్నవారికి అక్కడ ప్లాట్‌ తీసుకుంటే మంచి పెట్టుబడి అవుతుంది.

Updated Date - Oct 01 , 2025 | 12:36 AM