నేడు విశాఖ పోర్టుకు వీఎల్‌జీసీ నౌక శివాలిక్
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:51 AM
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం పరిధిలోకి వచ్చిన వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ (వీఎల్‌జీసీ) నౌక శివాలిక్ దేశంలోనే తొలిసారిగా విశాఖ పోర్టుకు సోమవారం రానుంది.
విశాఖపట్నం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాజమాన్యం పరిధిలోకి వచ్చిన వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ (వీఎల్‌జీసీ) నౌక శివాలిక్ దేశంలోనే తొలిసారిగా విశాఖ పోర్టుకు సోమవారం రానుంది. ఎల్‌పీజీ రవాణా నిమిత్తం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) గత నెల పదో తేదీన శివాలిక్ నౌకను తీసుకుంది. అబుదాబీ నుంచి విశాఖ పోర్టుకు రానుంది. ఈ నౌకకు కేంద్ర పోర్టులు, జల రవాణా శాఖా మంత్రి సర్బానంద సోనోవాల్ స్వాగతం పలికి, నౌకలోని సిబ్బంది, అధికారులను అభినందిస్తారు. అనంతరం శాలిగ్రాంపురంలోని సాగరమాల కన్వెన్షన్ హాల్‌లో జరిగే బహిరంగ సభలో విశాఖపట్నం పోర్టు అథారిటీ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. పోర్టు మౌలికసదుపాయాల అభివృద్ధి, నిర్వహణ సామర్థ్యాల పెంపు, పర్యావరణ హిత హరిత పోర్టు చర్యలను మారిటైమ్ ఇండియా విజన్- 2030కు అనుగుణంగా తీసుకెళ్లనున్న తీరును మంత్రి వెల్లడిస్తారు. శివాలిక్ నౌక భారత సముద్ర రవాణా రంగంలో మైలురాయిగా నిలుస్తుందని పోర్టు అధికారులు అభివర్ణిస్తున్నారు. భారత్ గ్యాస్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను బలోపేతం చేయడమే కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలక అడుగుగా అభివర్ణిస్తున్నారు.
రేషన్ డిపోల్లో బియ్యం నిల్
ఆన్‌లైన్ సమస్యతో చేరని సరకు
రెండువేల టన్నుల కోసం ఎదురుచూపులు
విశాఖపట్నం/గాజువాక/మర్రిపాలెం/మహారాణిపేట, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి):
ఈనెల ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డుదారులకు అందించాల్సిన బియ్యం సరఫరాలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సకాలంలో సరఫరా చేయకపోవడంతో సగరంలో కొన్ని రేషన్ డిపోల్లో స్టాకు లేదు. దీంతో కార్డుదారులు బియ్యం కోసం తిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబరు నెల ఇండెంట్ మేరకు జిల్లాకు ఇంకా రెండువేల టన్నుల బియ్యం రేషన్ డిపోలకు చేరాల్సి ఉంది.
జిల్లాలో ఎక్కువ డిపోలకు బియ్యం అందించే మర్రిపాలెం- 1 గోదాములో బియ్యం నిల్వలు లేవు. మిగిలిన గోదాముల్లో కూడా సరకు ఖాళీ అవడంతో అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. మొత్తం 641 రేషన్ డిపోల ద్వారా 5.24 లక్షల బియ్యంకార్డుదారులకు నెలకు సుమారు ఎనిమిదివేల టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. సాధారణంగా ప్రతినెలా ఒకటోతేదీ నుంచి సరకుల పంపిణీ కోసం ముందుగానే డిపోలకు బియ్యం సరఫరా ప్రారంభిస్తారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని బఫర్ గోదాముల నుంచి బియ్యం సరఫరా జరుగుతుంది. ఇందుకోసం కొత్తగా రూపొందించిన సాఫ్ట్‌వేర్ మొరాయించడంతో సమస్య ఎదురయింది. రెండు నెలలుగా ఇదే సమస్య ఎదురవుతున్నా పరిష్కరించలేక అధికారులు చేతులెత్తేశారు. దీంతో కార్డుదారులకు బియ్యం పూర్తిగా పంపిణీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. డిపోలకు అవసరమైన స్టాకులో 30 నుంచి 40 శాతం ఇచ్చిన అధికారులు మిగిలిన స్టాకు తరువాత ఇస్తామన్నారు. ఉన్న బియ్యం పంపిణీ చేసిన డీలర్లు నిల్వలు లేక డిపోలు మూసేయాల్సి వస్తోంది. ఈ పరిణామంతో పలుమార్లు డిపోలకు తిరగాల్సి వస్తోందని కార్డుదారులు వాపోతున్నారు. గోదాముల నుంచి డిపోలకు సరకు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ప్రతి నెలా ఒకేసారి వాహనాల్లో తరలించేవారు. తాజాగా నెలకొన్న సమస్యతో రెండుమూడు సార్లు తిప్పాల్సి వస్తోందని, దీంతో అదనపు భారం పడుతోందని గగ్గోలు పెడుతున్నారు. నగరంలోని కార్డులతోపాటు పోర్టబిలిటీ ద్వారా వేలాదిమంది బియ్యంకార్డుదారులు డిపోల నుంచి బియ్యం తీసుకుంటున్నందున అందుకు తగినట్టు ఏర్పాట్లు చేయడంలో పౌరసరఫరాల సంస్థ విఫలమైందని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.