5 నుంచి వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:40 PM
సాగర తీరంలోని పార్కు హోటల్ వెనుక ఎంజీఎం మైదానంలో వచ్చే నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రుచులతోపాటు అంతర్జాతీయ టేస్టులతో కూడిన ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఎంజీఎం గ్రౌండ్‌లో స్టాళ్లు
కలెక్టర్ హరేంధిరప్రసాద్
విశాఖపట్నం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సాగర తీరంలోని పార్కు హోటల్ వెనుక ఎంజీఎం మైదానంలో వచ్చే నెల ఐదు నుంచి ఏడో తేదీ వరకు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంధిరప్రసాద్ తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర రుచులతోపాటు అంతర్జాతీయ టేస్టులతో కూడిన ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా పర్యాటకశాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, ఈవెంట్ మేనేజర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మూడు రోజులపాటు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సుమారు 30 స్టాళ్లల్లో అన్ని రకాల ఆహార పదార్థాలు లభిస్తాయన్నారు. ఫుడ్ ఫెస్టివల్‌కు ప్రవేశం ఉచితమన్నారు. ఉత్తరాంధ్రలో వారసత్వంగా వచ్చే వంటలు, అంతర్జాతీయ రుచులు, ఆర్గానిక్ పంటలతో వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. అంతేకాక పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కాగా ఈ ఫుడ్ ఫెస్టివల్‌కు రూ.15 లక్షలు ఖర్చవుతుందని, పర్యాటకశాఖ రూ.ఐదు లక్షలు వెచ్చిస్తుండగా, స్పాన్సర్లు నుంచి కొంత మొత్తం, స్టాళ్ల ఏర్పాటుకు నామమాత్రం రుసుం వసూలు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఫుడ్ ఫెస్టివల్ వాల్ పోస్టర్‌ను కలెక్టర్, ఇతర ప్రతినిధులు ఆవిష్కరించారు.