Share News

చిన్న వయసులోనే దృష్టిలోపం

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:05 AM

దృష్టి లోపం సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది.

చిన్న వయసులోనే దృష్టిలోపం

  • పిల్లల్లో అధికమవుతున్న కంటి సమస్యలు

  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షల నిర్వహణ

  • ఇప్పటివరకూ 71 స్కూళ్లలోని 8,789 మందికి నిర్వహణ

  • 859 మందిలో సమస్య గుర్తింపు

  • గంటల తరబడి ఫోన్‌ వినియోగం, పోషకాహారలోపం ప్రధాన కారణాలు

విశాఖపట్నం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి):

దృష్టి లోపం సమస్యతో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు తరగతి గదిలో ఒకరిద్దరు మాత్రమే కళ్లద్దాలతో కనిపించేవారు. ఇప్పుడు కొంతమందికి స్కూల్‌లో చేరే సమయానికి కంటి అద్దాలు అవసరమవుతున్నాయి. పిల్లల్లో కంటి సంబంధిత సమస్యలు పెరుగుతున్నట్టు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం జాతీయ అంధత్వ నివారణ ప్రోగ్రామ్‌లో భాగంగా అందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. జూలై 21న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబరు 31 వరకూ కొనసాగనున్నది.

పది మందిలో ఒకరికి..

జిల్లాలోని 595 ప్రభుత్వ పాఠశాలలు, కళా శాలల్లో చదువుతున్న ఆరు నుంచి 18 ఏళ్లలోపు వయసున్న 54 వేల మందికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వీరిలో 34,500 మందికి పరీక్షలు నిర్వహించే బాధ్యతను ప్రాంతీయ నేత్ర వైద్యశాలకు ప్రభుత్వం అప్పగించింది. వీరిలో 4,500 మందికి దృష్టి దోషం ఉంటుందని, అందులో సుమారు 3,600 మందికి కళ్లద్దాలు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటివరకూ 71 స్కూళ్లలోని 8,789 మందికి కంటి పరీక్షలను నిర్వహించగా, 859 మంది దృష్టిలోపంతో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వీరిలో 721 మందికి కళ్లద్దాలు అవసరమవుతాయని నిర్ధారించారు. మరో 128 మందికి అదనపు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని నిర్ధారించి ప్రాంతీయ కంటి ఆస్పత్రికి రిఫర్‌ చేశారు.

కంటిపై ఒత్తిడి

కంటి సమస్యతో బాధపడుతున్న చిన్నారులు చూడడానికి, పుస్తకాలు చదవడానికి, రాయడానికి కంటిపై తీవ్రమైన ఒత్తిడి పెడుతున్నట్టు గుర్తించారు. కళ్లలో మంటగా ఉంటున్నట్టు, కళ్ల వెనుక భాగంలో నొప్పి ఉంటున్నట్టు పలువురు విద్యార్థులు వెల్లడించారు. అదేవిధంగా ఎక్కువ మంది విద్యార్థులు చేతితో కంటిని నలపడం వంటివి చేస్తున్నట్టు వైద్యులు గుర్తించారు.

బృందాల నియామకం

ప్రస్తుతం స్కూల్స్‌కు వెళ్లి ఈ తనిఖీలను చేపడుతున్నారు. ఈ కంటి పరీక్షలు కోసం పది బృందాలను ఏర్పాటు చేసినట్టు ప్రాంతీయ కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్‌, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్‌ అధికారిణి డాక్టర్‌ మీనాక్షి తెలిపారు. ఒక్కో బృందంలో పారా మెడికల్‌ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్‌, పారా మెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌, ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం ఉంటారు. వీరంతా వారికి కేటాయించిన షెడ్యూల్‌ మేరకు స్కూల్స్‌కు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు.

కారణాలు

చిన్నారులు కంటి సమస్యలతో బాధపడు తుండడానికి అనేక అంశాలు దోహదం చేస్తు న్నట్టు చెబుతున్నారు. ఇందులో ప్రధాన కారణం చిన్న వయసు నుంచే గంటల తరబడి ఫోన్‌ వినియోగించడంగా చెబుతున్నారు. అలాగే పోషకాహార లోపం, గర్భిణిగా ఉన్న సమయంలో తల్లి పోషకాహారాన్ని తీసుకోకపోవడం, తల్లి దండ్రుల్లో ఎవరో ఒకరు కళ్లద్దాలు విని యోగించడం, తీవ్రమైన ఒత్తిడి, విటమిన్లు సమస్య, ఒంటరితనం, చదువులో వెనుకబాటు, వెలుతురు సరిగా లేని చిన్నపాటి గదుల్లో తరగతులు నిర్వహించడం వంటి అంశాలు కారణమవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

తప్పనిసరిగా పరీక్షలు చేయించాలి

- డాక్టర్‌ మీనాక్షి, జిల్లా అంధత్వ నివారణ ప్రోగ్రామ్‌ అధికారి

గతంతో పోలిస్తే చిన్నారుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయి. చిన్న వయసులోనే టీవీలకు అలవాటు పడడం ప్రధాన కారణంగా ఉంది. ఈ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా వ్యవహరించాలి. చదువుతున్నప్పుడు, రాస్తు న్నప్పుడు పిల్లలు కంటిపై ఒత్తిడి పడుతున్నట్టు గుర్తిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. పిల్లలకు కంటి ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలను రోజువారీ ఆహారంలో ఉండేలా చూడాలి. ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. దీనివల్ల సమస్యను వేగంగా గుర్తించేందుకు అవకాశం ఉంది.

Updated Date - Aug 10 , 2025 | 01:05 AM